
సాధనతోనే లక్ష్యాన్ని చేరుకోవాలి
హత్నూర ఏటీసీని పరిశీలించిన
కలెక్టర్ ప్రావీణ్య
హత్నూర (సంగారెడ్డి): విద్యార్థులు ఏకాగ్రతతో సాధన చేసి చదువుకుని తమ లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ పి.ప్రావీణ్య పేర్కొన్నారు. మండల కేంద్రమైన హత్నూర ఐటీఐ ఆవరణలో ఇటీవల ప్రారంభించిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను హత్నూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఏటీసీలో కొనసాగుతున్న బోధనా విధానం, విద్యార్థులకు అందిస్తున్న సాంకేతిక శిక్షణను కలెక్టర్ పరిశీలించారు. ఇక్కడ అందుబాటులో ఉన్న కోర్సులు, టెక్నాలజీ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...సాంకేతిక నైపుణ్యం కలిగిన విద్యార్థులకే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఏటీసీ ద్వారా అందిస్తున్న శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. అనంతరం హత్నూర ఐటీఐ భవనంతోపాటు మెషీన్ షెడ్లను పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని మరమ్మతు లు చేయించేందుకు ప్రతిపాదనలు పంపించాలని ఐటీఐ ప్రిన్సిపాల్ సుబ్బలక్ష్మికి సూచించారు. అవసరమైతే మరమ్మతులతోపాటు పూర్తిగా పనికిరాని భవనాలను కూల్చివేసి నూతన భవనాలు నిర్మించేందుకు పరిశ్రమల సహకారం తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ పర్వీన్ షేక్, ఎంపీడీఓ శంకర్, ఎంపీఈఓ యూసుఫ్, డాక్టర్ రజినితోపాటు ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. రోగులకు అవసరమైన మందులను ఎప్పటికప్పుడు అందించాలని అవసరమైతే మందులను సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వైద్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.