
ప్రేమ పెళ్లి వద్దన్నందుకు..
● యువకుడు ఆత్మహత్య
● సిద్దిపేట జిల్లాలో ఘటన
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రేమ పెళ్లి వద్దన్నందుకు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని ఇబ్రహీంనగర్‌లో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన పొన్నాల శివసాయి(19)కి తల్లి ఎల్లవ్వ, సోదరి భవిత ఉన్నారు. తల్లీకొడుకు కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. సోదరి నర్స్ ట్రైనింగ్ చేస్తుంది. తండ్రి మల్లేశం రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా శివసాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని తల్లికి చెప్పాడు. కూలీ పనులు చేస్తేనే కుటుంబం గడుస్తుందని, ఇప్పుడు పెళ్లి వద్దని, తరుచూ ఫోన్ మాట్లాడవద్దని మందలించింది. దీంతో ఇంటి పక్కనే ఉన్న రేకుల షెడ్‌లో ఉరేసుకున్నాడు. ఇది గమనించిన తల్లి ఇతరుల సాయంతో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
జీవితంపై విరక్తి చెంది..
బెజ్జంకి(సిద్దిపేట): జీవితంపై విరక్తి చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ కథనం మేరకు... ఎల్లంపల్లె గ్రామానికి చెందిన సంగెం చంద్రవ్వ కుమారుడు రాజేందర్(25)తో కలిసి జీవిస్తుంది. శుక్రవారం ఉదయం చక్కెర తెస్తానని వెళ్లాడు. డిగ్రీ పూర్తి చేసిన రాజేందర్ ఉద్యోగం, ఉపాధి అవకాశాలు రాకపోవడంతో ఖాళీగా ఉంటున్నాడు. పెళ్లి సంబంధాలు రావడం లేదు. దీంతో మనస్తాపం చెంది బెజ్జంకి వైకుంఠధామం సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు.
ఇంటర్ విద్యార్థిని..
హత్నూర( సంగారెడ్డి): క్షణికావేశంలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని కొన్యాలలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీధర్ రెడ్డి వివరాల ప్రకారం... పుల్కల్ మండలం ఎస్ ఇటిక్యాల గ్రామానికి చెందిన మిన్పూరి మల్లేశం కూతురు మిన్పురి అనూష అలియాస్ వడ్డేపల్లి అనూష (16) కొన్నేళ్లుగా కొన్యాలలో అమ్మమ్మ వడ్డేపల్లి మల్లమ్మ దగ్గర ఉంటుంది. మండలంలోని గుండ్లమాచ్చునుర్ శివారులోని ఆదర్శ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. రోజు మాదిరిగానే ఆమె శుక్రవారం ఉదయం కళాశాలకు వెళ్లడానికి గ్రామంలోని బస్టాండ్ వద్ద నిలుచుంది. అదే సమయంలో అమ్మమ్మ అటువైపు వెళుతూ చేతిలో టిఫిన్ బాక్స్ కనిపించకపోవడంతో మీ నాన్నకు చెబుతానని అనడంతో అనూష తిరిగి ఇంటికి వెళ్లింది. క్షణికావేశంలో ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరేసుకుంది. అమ్మమ్మ వచ్చి చూసేసరికి ఉరి వేసుకుని కనిపించడంతో అనూష తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రేమ పెళ్లి వద్దన్నందుకు..