
కబ్జా చేస్తే ఇలాగే ఉంటుంది
● ప్రకృతి ప్రకోపాన్ని చవిచూడాల్సి వస్తుంది
● ఎంపీ రఘునందన్‌రావు హెచ్చరిక
● వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన
రామాయంపేట/నిజాంపేట(మెదక్)/ చిన్నశంకరంపేట(మెదక్): మెదక్ జిల్లా రామాయంపేట, సిద్దిపేట జాతీయ రహదారిపై నందిగామ వద్ద కొత్త వంతెన నిర్మాణం కోసం కృషి చేస్తామని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. గురువారం రామాయంపేట, నిజాంపేటలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. అనంతరం గురుకులంలో షెల్టర్ పొందుతున్న డిగ్రీ విద్యార్థినులను పరామర్శించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ.. చెరువులు, కుంటలను కబ్జా చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పారు. ఇకనైనా కబ్జాలను మానుకోకపోతే ప్రకృతి ప్రకోపాన్ని చవి చూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇలాంటి పరిస్ధితులు ఎదురైనప్పుడు యువత ముందుండి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీ సూచించారు.
జాతీయ రహదారి మరమ్మతులు చేపట్టాలి
జాతీయ రహదారిని వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఎంపీ రఘునందన్‌రావు కోరారు. గురువారం నార్సింగి జాతీయ రహదారిని పరిశీలించారు. జాతీయ రహదారి అధికారులతో మాట్లాడారు. వరద ఉధృతితో ఇసుక మేటలు వేసిన పంట పొలాలను పరిశీలించారు. జాతీయ రహదారిపై వరద రాకకు కారణం అన్వేషించి నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రమాదాల నివారణకు పోలీస్, రెవెన్యూ యంత్రాంగం, బీజేపీ కార్యకర్తలు స్పందించడంపై అభినందించారు.
విద్యుత్‌ను పునరుద్ధరించండి
హవేళిఘణాపూర్(మెదక్): వరద ముప్పు తప్పిందని, తమ తండాకు విద్యుత్ పునరుద్ధరించేలా చూడాలని మండల పరిధిలోని దూప్‌సింగ్ తండావాసులు ఎంపీ రఘునందన్‌రావుతో ఫోన్‌లో మొర పెట్టుకున్నారు. రాజ్‌పేట వంతెన సందర్శించిన అనంతరం అక్కడి నుంచి తండావాసులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. వరద ముప్పు ఏమీ లేదని, కరెంటు సరఫరా లేకపోవడంతో తాగునీటి, ఇతర అవసరాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ఇందుకు ఎంపీ బదులిస్తూ.. ప్రస్తు తం స్తంభాలు కూలిపోయి కరెంటు సరఫరా లేనందున ప్రత్యామ్నాయంగా కామారెడ్డి జిల్లా నుంచి విద్యుత్ సరఫరా చేసే విధంగా చూస్తామని హామీనిచ్చారు. ఎంపీ వెంట బీజేపీ జిల్లా నాయకులు శ్రీపాల్, ఎంఎల్‌ఎన్ రెడ్డి ఉన్నారు.