
కూతురిని కడతేర్చేందుకు యత్నించిన తండ్రి
నర్సాపూర్ రూరల్: కన్న కూతురును కడ తేర్చేందుకు ప్రయత్నించిన ఓ కసాయి తండ్రి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మండలంలోని అచ్చంపేటలో జరిగింది. ఎస్సై లింగం వివరాల ప్రకారం... తుజాల్‌పూర్ గ్రామానికి చెందిన శ్రీరామ్ ప్రశాంత్‌కు కొన్నేళ్ల క్రితం అచ్చంపేట గ్రామానికి చెందిన ఇందుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు రుతిక, రియాన్షిక ఉన్నారు. ఆరు నెలల క్రితం భార్యభర్తల మధ్య సంసారం విషయంలో గొడవ జరిగింది. దీంతో ఇందు ఇద్దరు కూతుళ్లతో పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రశాంత్ ఆదివారం అచ్చంపేటలోని భార్యాపిల్లల వద్దకు వెళ్లి చిన్న కూతురు తనకు పుట్టలేదని భార్యతో గొడవ పెట్టుకుని రియాన్షికను పైకిఎత్తి సీసీ రోడ్డుపై పడేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో మొదట నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఇందు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థులందరికీ
పాఠ్యపుస్తకాలు
కంది(సంగారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ పుస్తకాలను అందజేస్తున్నామని పుస్తకాల పంపిణీ ప్రత్యేక అధికారి రమణకుమార్ తెలిపారు. సోమవారం మండల కేంద్రమైన కందిలోని కేంద్ర ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠ్యాంశాలపై విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి సమర్థ్యాన్ని పరీక్షించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి జోగప్ప, సీఎమ్‌ఓ వెంకటేశం, ప్రధానోపాధ్యాయురాలు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ఆక్రమించి
ఇల్లు నిర్మాణం
పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు
జహీరాబాద్ టౌన్: పంచాయతీ రోడ్డును అక్రమించి ఇల్లు నిర్మిస్తున్నా కార్యదర్శి అభ్యంతరం చెప్పకుండా సహకరిస్తున్నారని మండలంలోని ఆనేగుంట గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఓ వ్యక్తి యథేచ్ఛగా రోడ్డును అక్రమించి ఇంటి నిర్మాణం పనులు చేపట్టడంతో రహదారి కబ్జాకు గురవుతుందన్నారు. అడ్డుకోవాల్సిన పంచాయతీ కార్యదర్శి వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయమై ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినా ఆయన కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు మధ్యలో చేపడుతున్న నిర్మాణం పనులు ఆపేసి కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరారు.