
37లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
డీఆర్‌డీఓ శ్రీనివాస్
కౌడిపల్లి(నర్సాపూర్): జిల్లాలో వన మహోత్సవం సందర్భంగా వర్షాకాలంలో 37లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించామని డీఆర్‌డీఓ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మండల కేంద్రమైన కౌడిపల్లి గ్రామ పంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం నర్సరీని పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో వివిధ శాఖల పరిధిలో 37లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా ఇందులో ఉపాధిహామి పథకం ద్వారా 25లక్షలు నాటేందుకు నిర్ణయించామన్నారు. కాగా ఇప్పటివరకు యాబైశాతం మొక్కలు నాటినట్లు తెలిపారు. త్వరలో అన్ని గ్రామాల్లో అవసరమైన పండ్లు, పూలు, ఇతర మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో యాబైవేల మంది ఆసరా పింఛన్ లబ్ధిదారులకు ఫేస్ రికగ్నిషన్ ద్వారా పంపిణీ చేస్తున్నామని, తొంబైశాతం పూర్తి అయిందన్నారు. పింఛన్ డబ్బులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఓ కలీముల్ల, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, ఈసీ ప్రేమ్‌కుమార్, కారోబార్ ఎల్లం తదితరులు పాల్గొన్నారు.