
కొత్త చెరువు వద్ద పైపులు ధ్వంసం
జోగిపేట(అందోల్): సింగూరు నుంచి కాల్వల ద్వారా జోగిపేట కొత్త చెరువులోకి వచ్చే పైపులైనును కొందరు ధ్వంసం చేసి చెరువులోకి నీరు రాకుండా అడ్డుకున్నారని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు ఇలా... సింగూరు ప్రాజెక్టు ద్వారా చెరువులోకి నీరు వచ్చేలా ప్రభుత్వం పైపులైనును ఏర్పాటు చేసిందని, ఆ నీటిని మళ్లించుకునేందుకు పైపులను, సిమెంట్ కట్టడాలను ధ్వంసం చేశారని రైతులు వాపోయారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని సోమవారం అందోల్‌లోని ఇరిగేషన్ అధికారులకు జోగిపేట రైతులు ఫిర్యాదు చేశారు. సింగూర్ కెనాల్ నుంచి పైపుల ద్వారా కొత్త చెరువులోకి మాసానిపల్లి గ్రామం నుంచి నీళ్లు వస్తాయని, ఆ గ్రామంలోని చెరువులోకి వెళ్లే కాల్వ కూడా వేరుగా ఉందని పేర్కొన్నారు. అయితే ఆదివారం రాత్రి చెరువు వద్ద తాము చేసిన పనులను పూర్తిగా ధ్వంసం చేసి నీళ్లు రాకుండా అడ్డుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తాము ప్రశ్నిస్తే తమపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు.
ఇరిగేషన్ అధికారులకు రైతుల ఫిర్యాదు
బాధ్యులపై చర్యలకు డిమాండ్