
నిలిచిన నిమ్జ్ భూ సేకరణ
జహీరాబాద్ టౌన్: నిమ్జ్ కార్యకలాపాలకు బ్రేక్ పడింది. కొన్ని రోజులుగా స్పీడ్ అందుకున్న భూ సేకరణ పనులు ఆగిపోయాయి. నిమ్జ్ కార్యాలయంలో ప్రస్తుతం కార్యకలాపాలు జరగడం లేదు. జూలై 10న నిమ్జ్ కార్యాయలంలో ఏసీబీ దాడులు చేయడంతో భూసేకరణకు సంబంధించి పరిహారం చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. జహీరాబాద్ ప్రాంతానికి జాతీయ ఉత్పాదక మండలి (నిమ్జ్) మంజూరు కాగా, నియోజకవర్గం పరిధిలోని న్యాల్‌కల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో 12,635 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములను నిమ్జ్‌కు కేటాయించారు. ఫేజ్ వన్‌లో 3,240 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 2,888 ఎకరాల భూమిని సేకరించారు. ఇంకా 352 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇటీవట ఫేజ్‌వన్‌కు సంబంధించి మిగులు భూమి సేకరణకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. నిమ్జ్ కార్యాలయంలో పనులు జరగని కారణంగా పరిహారం చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. సెకండ్ ఫేజ్‌లో 9,747 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు సుమారు 4 వేల ఎకరాల భూమిని సేకరించారు. హద్నూర్, మామిడి తదితర గ్రామాలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. పంపిణీకి చెక్కులు కూడా సిద్ధంగా ఉన్నాయి. పరిహారం చెక్కుల కోసం రైతులు నిమ్జ్ కార్యాలయం చుట్టూ తిరిగి వెళ్తున్నారు. ఏసీబీ దాడుల తర్వాత కార్యాలయంలో ఎలాంటి పనులు కూడా జరగడం లేదు. నెల రోజుల క్రితం నిత్యం రైతులతో కిక్కిరిసిన నిమ్జ్ కార్యాలయం ప్రస్తుతం బోసిపోయింది.
ఆర్డీఓకు అదనపు బాధ్యతలు
నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ రాజు (రాజిరెడ్డి), డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య ఏసీబీ అధికారులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. జహీరాబాద్ ఆర్డీఓ రాంరెడ్డికి నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలను కలెక్టర్ ప్రావీణ్య అప్పగించారు. నిమ్జ్ భూముల సేకరణకు సంబంధించిన పనులపై ఆర్డీఓ శ్రద్ధ చూపడం లేదు. ఏసీబీ దాడుల నేపథ్యంలో పరిహారం చెల్లింపుల వ్యవహరంలో గందరగోళం నెలకొనడంతో నిమ్జ్ ఫైళ్లను ముట్టుకోవడం లేదని తెలిసింది. దీంతో నిమ్జ్ కార్యాలయంలో కార్యకలాపాలు స్తంభించాయి.
11 సంవత్సరాలుగా..
నిమ్జ్ కోసం 11 సంవత్సరాల నుంచి వందల ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఇప్పటికే పరిశ్రమల ఏర్పాటుకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. రక్షణ ఏరోనాటిక్స్ అంతరిక్ష రంగాల్లో ఉపయోగించే పరికరాలను ఉత్పత్తి చేసే వెమ్ టెక్నాలజీతో ఒప్పదం జరిగింది. రూ. వెయ్యి కోట్లతో ఏర్పాటుకానున్న పరిశ్రమలకు 511 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ మేరకు గత ప్రభుత్వంలో శంకుస్థాపన కూడా చేశారు. ఆటోమోటీవ్ విడిభాగాల జర్మనీ కంపెనీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ట్రైటాన్, హ్యూందాయ్ మోటార్స్‌తో కూడా ఒప్పందాలు జరిగాయి. హ్యూందాయ్ మోటార్స్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ప్రచారం జరిగింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కూడా కలిశారు. కానీ ఇంతవరకు నిర్మాణ పనులకు శ్రీకారం చ్టుటడం లేదు. నిమ్జ్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.
కార్యకలాపాలకు బ్రేక్
ఆగిన పరిహారం చెక్కుల పంపిణీ