
బిల్లును అడ్డుకుంటున్నది బీజేపీనే
● కాళేశ్వరంలో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించొద్దు
● కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నారాయణఖేడ్: బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించినప్పటికీ కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని సీపీఐ రాష్ట్ర నాయకుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. నారాయణఖేడ్‌లో ఆదివారం నిర్వహించిన సీపీఐ జిల్లా నాల్గవ మహాసభల్లో పాల్గొని మాట్లాడారు. బీజేపీ నాయకులు స్వార్థం కోసం అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణం విషయంలో తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఆ సమస్యల పరిష్కారం కోసం ఎంతటి పోరాటాలకై నా తమ పార్టీ సిద్ధంగా ఉంటుందన్నారు. సింగూరు జలాలు సంగారెడ్డి జిల్లా ప్రజలకే అందాలన్నారు. జిల్లాలో తాగు, సాగునీటి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి కర్మాగారాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి ఈటీ నర్సింహా, కార్యదర్శి సయ్యద్ జలాలొద్దీన్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మంద పవన్, నాయకులు ప్రకాశ్‌రావు, జిల్లా సహాయ కార్యదర్శి ఆనంద్, కార్యవర్గ సభ్యులు రహేమాన్, తాజొద్దీన్, దత్తురెడ్డి, మహబూబ్‌ఖాన్, రుబీనా తదితరులు పాల్గొన్నారు.