
ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా?
ప్రజలు తినే ఆహార పదార్థాల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలు, టిఫిన్ సెంటర్లలో ప్రజారోగ్యం దృష్ట్యా ఫుడ్ సేఫ్టీ, మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు నిర్వహించాలి. నిల్వ చేసిన మాంసం, కుళ్లిన వాటితో వంటకాలు చేసి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కానీ, జిల్లాలో అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
– దుబ్బాకటౌన్
దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, అక్బర్‌పేట భూంపల్లి, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో 30కి పైగా రెస్టారెంట్‌లు, దాబాలున్నాయి. కానీ సంవత్సరం నుంచి అధికారుల తనిఖీలు కరువయ్యాయి. ఓ వైపు హోటల్స్, దాబాల్లో నాసిరకం ఆహార పదార్థాలు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
సాంబార్‌లో పురుగు..
ఇటీవల దుబ్బాక పట్టణంలో శ్రీకృష్ణ ఉడిపి హోటల్‌లో సాంబర్‌లో పురుగు వచ్చిన ఘటన కలకలం రేపింది. దీంతో అధికారులు తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ సేకరించారు. ఫలితాలు ఇంకా బయట పెట్టలేదు. అపరిశుభ్రంగా ఉందని, కుళ్లిన కూరగాయలు ఉన్నాయని మున్సిపల్ అధికారులు రూ. 5వేల జరిమాన విధించారు.
తనిఖీలు కరువు..
సంవత్సరం నుంచి దుబ్బాకలో అధికారుల తనిఖీలు లేవు. దీంతో కొందరు హోటల్ నిర్వాహకులు అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను వండి విక్రయిస్తూ.. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. గతంలో సైతం దుబ్బాకలో కుళ్లిన కేక్ విక్రయించిన ఘటన చోటు చేసుకుంది. అనంతరం కనీసం తనిఖీలు నిర్వహించకపోవడంతో అసలు ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఉన్నారా? లేరా? అనే అనుమానాలు పట్టణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ బేకరీలో కాలం చెల్లిన బిస్కెట్ విక్రయించినట్లు తెలిసింది. కూరగాయలు, మాంసం కుళ్లిపోయిన వాటిని ఫ్రిజ్‌లో భద్రపరిచి వండి విక్రయిస్తున్నారని వినికిడి. రెస్టారెంట్లు, చిన్నచిన్న హోటళ్లు, రోడ్డు పక్కన విక్రయించే తినుబండారాల్లో కల్తీ నూనెలు, మసాలా దినుసులు వాడటం వల్ల అనేక ప్రాణాంతక వ్యాధులు సోకుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కూల్ డ్రింక్స్ పై రూ.10 అదనం
దుబ్బాకలో కొన్ని రెస్టారెంట్‌లలో రూ.10 కూల్‌డ్రింక్‌కు ఏకంగా మరో రూ.10 అదనంగా తీసుకుని హోటల్స్‌కి వచ్చే వారిని దండుకుంటున్నారు. ఎందుకు అదనంగా తీసుకుంటున్నారని అడిగితే రూ. 10 కూల్‌డ్రింక్ పై ఏసీ ఛార్జ్ వేయడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాగా, దుబ్బాకలో ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదని జిల్లా ఆహార తనిఖీ అధికారి జయరామ్‌ను సాక్షి వివరణ కోరగా పొంతన లేని సమాధానం చెప్పాడు.
హోటల్స్, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ తనిఖీలేవీ?
నిల్వ చేసిన పదార్థాలతో వంటకాలు
అపరిశుభ్రంగా వంటగదులు
నిమ్మకు నీరెత్తినట్లు అధికారుల తీరు
నాణ్యతకు తిలోదకాలు..
ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది అర్థం కాని ప్రశ్న. జిల్లాలో కొన్ని చోట్ల తనిఖీలు నిర్వహించిన అధికారులు కేవలం శాంపిళ్లు తీసుకెళ్లి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సి ఉన్నా స్థానిక మున్సిపాలిటీ అధికారులు, ఇటు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నుంచి తనిఖీలు లేకపోవడంతో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నిద్రమత్తు వీడి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నడుస్తున్న హోటల్స్, రెస్టారెంట్లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
అధికారులు చర్యలు తీసుకోవాలి
నా పేరు యాదగిరి. మాది దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామం. నేను ఉడిపి హోటల్‌లో దోష ఆర్డర్ చేసి తింటున్నప్పుడు సాంబార్‌లో పురుగు కనిపించింది. వెంటనే యజమానిని అడగగా పొంతన లేని సమాధానం చెప్పాడు. ఒకవేళ నేను ఆ పురుగును చూడకపోతే నా పరిస్థితి ఏమయ్యేది. నిర్లక్ష్యం వహిస్తున్న హోటళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
– యాదగిరి, రాజక్కపేట

ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా?