
ఈత చెట్ల పెంపకానికి భూములివ్వాలి
కొండాపూర్(సంగారెడ్డి): ఈత చెట్లు పెంచేందుకు కల్లు గీత సొసైటీలకు భూములివ్వాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొల్లపల్లిలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం అమరవీరులయాదిలో గీతన్నల సామాజిక చైతన్యయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సర్దార్ సర్వాయి పాపన్న, మహాత్మ జ్యోతిరావుపూలే, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి, అక్కడనుంచి మల్కాపూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆశన్నగౌడ్ మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ఈత తాటి చెట్ల పెంపకానికి ప్రతీ కల్లుగీత సొసైటీలకు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలని, వాటి సంరక్షణ కోసం డ్రిప్, బోరు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా గీత కార్మికులకు, గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. మునిదేవునిపల్లి, మాందాపూర్ అలియాబాద్ గ్రామాలలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న కల్లుగీత సొసైటీలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు?
18 వరకు సామాజిక చైతన్య యాత్ర
సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని ఈ నెల 18 వరకు సామాజిక చైతన్యయాత్ర కొనసాగుతుందని అదేరోజు సంగారెడ్డిలో ముగింపు సభ నిర్వహించనున్నట్లు ఆశన్నగౌడ్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, కృష్ణగౌడ్, నాగరాజు గౌడ్, రామాగౌడ్, వెంకటేశంగౌడ్, కుమార్‌గౌడ్, మల్కాపూర్ టీటీసీఎస్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, అనంతయ్య గౌడ్, రమేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కల్లు గీత కార్మిక సంఘం జిల్లా
అధ్యక్షుడు ఆశన్నగౌడ్