
పప్పు ధాన్యాల సాగు.. ఆశాజనకం
అధికారుల సూచనలు
పాటించాలి
ఖరీఫ్ పంటలు ప్రస్తుతం ఆశాజనకంగా ఉన్నాయి. ఈ సంవత్సరం పంటలకు అనుకూలంగా వానలు పడుతున్నాయి. పంటల సాగులో ఎరువుల వాడకం, సస్యరక్షణ చర్యలు తదితర తెగుళ్ల నివారణకు రైతులు అధికారుల సూచనలు పాటించాలి.
–భిక్షపతి, ఏడీఏ, జహీరాబాద్
● ఖరీఫ్ పంటలకు జీవం పోసిన వర్షాలు
● హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
జహీరాబాద్ టౌన్: పప్పు ధాన్యాల సాగు ఆశాజనకంగా ఉండటంతో రైతులు దిగుబడిపై ఆశలు పెట్టుకున్నారు. పప్పుధాన్యాల కొరతపై అవగాహన ఉన్న అన్నదాతలు కంది, సోయాబీన్, పెసర, మినుము పంటలను సాగు చేస్తున్నారు. నైరుతి రుతు పవనాల కారణంగా మే నెలలో వర్షాలు కురిశాయి. అదే సమయంలో రైతులు ఖరీఫ్ పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. అయితే జూన్‌లో వరుణుడు ముఖం చాటేయడంతో ఆందోళన చెందారు. పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. జులైలో ఓ మోస్తారు వానలు కురవడంతో పంటలకు ప్రాణం పోసినట్లయింది. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
జహీరాబాద్ వ్యవసాయశాఖ డివిజన్‌లో జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాలు ఉన్నాయి. ప్రాజెక్టులు, చెరువులు లేనందున ఆయా మండలాల్లో వర్షధార పంటలను అధిక విస్తీర్ణంలో రైతులు పండిస్తుంటారు. ప్రధానంగా పత్తి, కంది, మొక్కజొన్న, జొన్న, పెసర, మినుము, సోయాబీన్ పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది లక్షల ఎకరాల్లో వానాకాలం పంటలను సాగు చేశారు. సుమారు 3 లక్షల ఎకరాల్లో పత్తి, 65 వేల ఎకరాల్లో సోయాబీన్,70 వేల ఎకరాల్లో కంది, 7,500 ఎకరాల్లో మినుము, 14వేల ఎకరాల్లో పెసర, 7వేల ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. ప్రస్తుతం కురుస్తున్న వానలు పంటలకు జీవం పోస్తున్నాయి. వ్యవసాయశాఖ అధికారులు గ్రామాలను సందర్శించి పంటలను పరిశీలిస్తున్నారు.
జోరుగా కలుపుతీత పనులు
పంట పొలాల్లో పెరుగుతున్న కలుపు రైతులకు కంటి మీద కునుకులేకుండా చేస్తుంది. ఆయా పంట చేన్లు ఎదుగుదల దశలో ఉన్నాయి. కలుపు కూడా అదే స్థాయిలో పెరిగిపోతుంది. కూలీల కొరత వల్ల అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. స్థానికంగా కూలీలు అందుబాటులో లేకపోవడంతో ఆటో చార్జీలిచ్చి మరి ఇతర గ్రామాల నుంచి తీసుకు వస్తున్నారు. ఎకరాకు రూ.6 నుంచి 8 వేల వరకు కూలీలు తీసుకుంటున్నారు. కలుపుతీత పనులు తలకుమించిన భారంగా మారాయని అన్నదాతలు వాపోతున్నారు.

పప్పు ధాన్యాల సాగు.. ఆశాజనకం