
ఇళ్లు కడతానని గుల్ల చేశాడు
చిన్నశంకరంపేట(మెదక్): ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తానని నమ్మబలికిన కాంట్రాక్టర్ లక్షల్లో అడ్వాన్స్ తీసుకుని కన్పించకుండా పోయాడు. ఈ ఘటన మండలంలోని మిర్జాపల్లితండాలో చోటుచేసుకుంది. తండాలో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు జార్కండ్‌కు చెందిన ఎండీ అబ్దుల్ యూనస్ ముందుకొచ్చాడు. మండలంలోని ఓ పరిశ్రమలో కాంట్రాక్టు పనులు నిర్వహిస్తుండటంతో గిరిజనులు నమ్మి అడ్వాన్స్‌గా లక్ష చొప్పున ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు. బేస్‌మెంట్ వరకు నిర్మించి బిల్లు వచ్చిన తరువాత మిగితా పనులు చేస్తానన్నాడు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల బేస్‌మెంట్ బిల్లు రావడంతో మళ్లీ రూ. లక్ష చొప్పున 14 మంది కాంట్రాక్టర్‌కు ఇచ్చారు. మరి కొంత మంది ఇంటి నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని అదనంగా మరో రూ.2 లక్షలు కూడా అందజేశారు. డబ్బులు తీసుకున్న కాంట్రాక్టర్ వారం క్రితం ఎవరికీ చెప్పకుండా ఇక్కడి నుంచి ఉడాయించాడు. ఫోన్‌చేస్తే స్విచ్చాఫ్ వస్తుండటంతో గిరిజనులు అతను నివాసం ఉంటున్న ఇంటికెళ్లి ఆరా తీయగా వారం నుంచి కన్పించడం లేదని చెప్పారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డబ్బులు తీసుకుని కాంట్రాక్టర్ పరారీ
లబోదిబోమన్న ఇందిర మ్మ లబ్ధిదారులు