
సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్
వివరాలు వెల్లడించిన సీఐ శ్రీను
సిద్దిపేటరూరల్: అమాయక ప్రజలను మోసం చేసి సొమ్ము చేసుకుంటున్న సైబర్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రూరల్ సీఐ శ్రీను స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ గ్రామానికి చెందిన చెట్టు మహేశ్, మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఎరుకల కావడి అశోక్, ఎరుకల గోపి ప్రస్తుతం సిద్దిపేటలోని బాలాజీ నగర్‌లో ఉంటున్నారు. లలిత నగర్‌లో ఉంటున్న ఎరుకల గారడి ప్రశాంత్‌తో కలిసి నలుగురు ముఠాగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కిరాణ దుకాణాలు, వైన్స్ షాపులు, పెట్రోల్‌బంకులు, మీసేవా కేంద్రాలు, వ్యాపార సముదాయాల వద్ద అత్యవసరం అంటూ నకిలీ ఫోన్‌పే, గూగుల్ పే యాప్‌లతో చెల్లింపులు చేస్తూ డబ్బులు తీసుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నేరస్తులను పట్టుకుని జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపించారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అలాంటి చర్యలకు పాల్పడితే వెంటనే 100, పోలీస్‌కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 కు ఫోన్ చేయాలన్నారు. విలేకరుల సమావేశంలో రూరల్ ఎస్‌ఐ రాజేశ్, చిన్నకోడూరు ఎస్‌ఐ సైఫ్‌అలీ, సిబ్బంది పాల్గొన్నారు.