
బందీ అయిన బాల్యం!
ఫలించని ఆపరేషన్‌లు
● మారని తల్లిదండ్రులు, యజమానులు ● యేటా పెరుగుతున్న బాల కార్మికులు ● 99 మందికి విముక్తి..54 కేసులు నమోదు
మెదక్ కలెక్టరేట్: బడిలో చదువుకుంటూ సరదాగా గడపాల్సిన చిన్నారుల బాల్యం పనుల్లో బందీ అవుతోంది. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రతియేటా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరిట ఆరు నెలలకోసారి అధికార బృందం తనిఖీలు చేస్తుంది. కానీ తల్లిదండ్రులు, యజమాను లు, విద్యార్థుల్లో మార్పు రావడం లేదు. ఫలితంగా బాల కార్మికుల సంఖ్య పెరుగుతూ నే ఉంది. పేద ప్రజలు తమ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పిల్లలను పనుల్లో పెడుతుండగా, తక్కువ జీతం, ఎక్కువ గంటలు పనిచేయిస్తూ యజమానులు శ్రమదోపిడీకి పాల్పడుతున్నారు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి కేసులు పెడుతున్నారు. అయినా క్షేత్రస్థాయిలో చైతన్యం వచ్చే వరకు ఫలితం కానరాదని సమాజ సేవకులు వాపోతున్నారు.
ఆర్థిక సమస్యే ప్రధాన కారణం
బడీడు పిల్లలు బడిలో కాకుండా బాల కార్మికులుగా మారడానికి ఆర్థిక సమస్యలే ప్రధాన కారణం. తల్లిదండ్రులు లేని పిల్లలు, చదువుకునే ఆర్థిక స్తోమత లేని వారు కొందరైతే.. అమ్మనాన్నల అనారోగ్యం దృష్ట్యా ఆర్థికంగా అండగా ఉండేందుకు పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. చదువులో ఫెయిలైన విద్యార్థులు, చదువుపై ఆసక్తి లేని వారు సైతం బాల కార్మికులుగా మారి వెట్టి చాకిరీ చేస్తున్నారు.
పిల్లలను ప్రోత్సహించాలి
ఈ నెల 1న చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్‌లో ఇప్పటి వరకు 99 మంది బాల కార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పించాం. అలాగే జిల్లా వ్యాప్తంగా 54 కేసులు నమోదు చేశాం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూళన జరగాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులు, సంరక్షకులు, యజమానుల్లో మార్పు రావాలి. బడీడు పిల్లలను బడికి వెళ్లేలా ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలే అత్యధికంగా ఉన్నారు. ఎవరైనా బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే రూ.20వేల జరిమానాతోపాటు కేసు కూడా నమోదవుతుంది. ఈనెలాఖరు వరకు ఆపరేషన్ ముస్కాన్ కొనసాగుతుంది.
– కరుణశీల, బాలల సంరక్షణ అధికారి, మెదక్
రెండేళ్లుగా కార్మికులు ఇలా..
సంవత్సరం పట్టుబడిన బాలలు కేసులు
2024 జనవరి (ఆపరేషన్ స్మైల్) 118 27
2024 జూలై (ఆపరేషన్ ముస్కాన్) 46 1
2025 జనవరి (ఆపరేషన్ స్మైల్) 122 25
2025 జూలై (ఆపరేషన్ ముస్కాన్) 99 54

బందీ అయిన బాల్యం!

బందీ అయిన బాల్యం!