
‘మంజీరా’లో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
పాపన్నపేట(మెదక్): మంజీరా నదిలో గల్లంతైన శాయిబాజ్ (26) మృతదేహం ఎట్టకేలకు సోమవారం సాయంత్రం దొరికింది. మిత్రులతో కలిసి చేపల వేటకు వెళ్లిన బాచారం గ్రామానికి చెందిన శాయిబాజ్ ఆదివారం ముద్దాపూర్ బ్రిడ్జి కింద గల్లంతయ్యాడు. అతని తండ్రి గౌస్ పాషా ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తన బృందాలతో కలిసి వెతికినప్పటికీ ఆచూకి లభించలేదు. దీంతో సోమవారం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఫైర్, పోలీస్, రెవెన్యు అధికారులు తమ బృందాలతో ఎయిర్ బోట్‌లు, స్కానర్‌లతో కలిసి గాలించారు. మంజీరా నది వెడల్పు 400 మీటర్లు, లోతు 30 నుంచి 40 ఫీట్లు ఉండటంతో గాలింపు చర్యలు సత్ఫలితం ఇవ్వలేదు. ఎట్టకేలకు సాయంత్రం బ్రిడ్జికి 30 మీటర్ల దూరంలో మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా తమ కొడుకు మృతి పట్ల వెంట వెళ్లిన అతని మిత్రులపై అనుమానం ఉందని గౌస్‌పాషా ఆరోపించారు.