
నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తులు
● 9వ,11వ తరగతుల్లో అడ్మిషన్లకుఅవకాశం ● సెప్టెంబర్ 23 వరకు దరఖాస్తులస్వీకరణ ● వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఎంట్రెన్స్ పరీక్ష
వర్గల్(గజ్వేల్): ఆశ్రమ విద్యతో బాల బాలికల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వాలు బాటలు వేస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరానికి గాను 9వ,11వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన విద్యార్థులు ఎంట్రెన్స్ పరీక్ష రాసేందుకు సెప్టెంబర్ 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. ఫిబ్రవరి 7న (లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్) ఎంపిక పరీక్ష జరుగుతుందని, అందులో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు www.navodaya.gov.in ద్వారా సెప్టెంబర్ 23 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు ప్రోత్సహించాలని కోరారు. అభ్యర్థులకు అర్హత, పరీక్ష సిలబస్ తదితర విషయాలను వివరించారు.
ఇవిగో అభ్యర్థుల అర్హతలు
● ప్రవేశం పొందే బాలబాలికలు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెంది, వారి తల్లిదండ్రులు ఇక్కడే నివాసం ఉండాలి.
● 9వ తరగతిలో ప్రవేశం కోసం అభ్యర్థులు ప్రస్తుత విద్యాసంవత్సరం(2025–26)లో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి చదువుతూ ఉండాలి. అభ్యర్థి మే 1, 2011 నుంచి జూలై 31, 2013 మధ్య జన్మించి ఉండాలి.
● 11వ తరగతిలో ప్రవేశం పొందే అభ్యర్థులు ప్రస్తుత విద్యాసంవత్సరం(2025–26)లో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 10వ తరగతి చదువుతూ ఉండాలి. జూన్ 1, 2009 నుంచి జూలై 31, 2011 మధ్య జన్మించి ఉండాలి.
9వ తరగతి పరీక్ష సిలబస్
హిందీ, ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, సైన్స్‌కు చెందిన ప్రశ్నలు ఉంటాయి. ఓఎమ్‌ఆర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్‌లో పరీక్ష ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.
11వ తరగతి పరీక్ష సిలబస్
మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్‌కు చెందిన ప్రశ్నలు ఉంటాయి. ఓఎమ్‌ఆర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్‌లో పరీక్ష ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఇతర వివరాలకు నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్‌లో చూడొచ్చు.