
బురద పొలంలో పడి రైతు మృతి
మిరుదొడ్డి(దుబ్బాక): ప్రమాదవశాత్తు కాలు జారి బురద పొలంలో పడి రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రమైన మిరుదొడ్డిలో జరిగింది. ఎస్‌ఐ సమత వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చెక్క భిక్షపతి (38) వ్యవసాయం చేసుకుంటూ భార్య బాలమణి, ఇద్దరు కొడుకులు, ఒక కూతురుతో పాటు, తల్లి బాలమ్మను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో పనులు చేసుకోవడానికి పొలం ఒడ్డుపై నడుస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి బురద పొలంలో పడిపోయాడు. బురదలో తల కూరుకు పోవడంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన పరిసర ప్రాంత రైతులు హుటాహుటిన దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్ల నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చేపల కోసం వెళ్లి యువకుడు..
తూప్రాన్: ప్రమాదవశాత్తు యువకుడు చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన పట్టణ పరిధిలోని అల్లాపూర్ పెద్ద చెరువు వద్ద జరిగింది. ఎస్‌ఐ శివానందం వివరాల ప్రకారం... పాపన్నపేట మండలం నార్సింగికి చెందిన టంటం ప్రవీణ్(30) కొంత కాలంగా పట్టణంలోని గీతారెడ్డి కాలనీలో భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నాడు. అడ్డా కూలీగా పనిచేస్తున్నాడు. సోమవారం అడ్డాపై పని దొరకకపోవడంతో చేపలు పట్టేందుకు అల్లాపూర్ శివారులోని తిమ్మాయ చెరువు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో చెరువులో పడి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతునికి భార్య లలిత, బాబు, పాప ఉన్నారు.
భూ తగాదాలతో.. మనస్తాపానికి గురై..
గజ్వేల్‌రూరల్: ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం గజ్వేల్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌కు చెందిన శ్రీరాం మల్లేశ్(59) కుటుంబ సభ్యులకు పట్టణంలోని లక్ష్మీప్రసన్నకాలనీలో గల భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన మల్లేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి మల్లేశ్‌ను గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మల్లేశ్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బురద పొలంలో పడి రైతు మృతి

బురద పొలంలో పడి రైతు మృతి