
వృత్తి నటన.. ప్రవృత్తి దొంగతనం
సంగారెడ్డి క్రైమ్ : మహిళ మెడలోంచి మంగళసూత్రం ఎత్తుకెళ్లిన నిందితులను అరెస్టు చేసి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐ రమేష్ కేసు వివరాలు వెల్లడించారు. రేగోడు మండలానికి చెందిన గోరం అనీల్(25),గోరం సునీల్ (23) ఇద్దరు అన్నదమ్ములు. పటాన్‌చెరువులోని గౌతమ్ నగర్‌లో అద్దెకు ఉంటూ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా జీవనం కొనసాగిస్తున్నారు. పట్టణంలోని అయ్యప్ప కాలనీకి చెందిన ఇందిరి లక్ష్మి ఈనెల 22న సాయంత్రం నాలుగు గంటల సమయంలో బైపాస్‌లోని రిషీ స్కూల్ నుంచి తన మనవరాలుని ఇంటికి తీసుకెళ్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి మెడలోంచి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం పట్టణంలోని ఐబీ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా, యమహ ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చిన ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసి విచారించగా.. నేరం అంగీకరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి యమహ ద్విచక్ర వాహనం, ఫోన్, మూడు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. సీఐ వెంట పట్టణ ఎస్సై రాజశేఖర్, సర్దార్,హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, కానిస్టేబుల్ నగేంద్రబాబు,ప్రదీప్,శివకుమార్ ఉన్నారు.
చైన్ స్నాచింగ్ కేసులో నిందితుల అరెస్టు