
చిత్రాలే.. పాఠాలై..
● ఆయా పాఠశాలల్లో గోడలపై బొమ్మలు
● సులభంగా విద్యార్థులకు అర్థమయ్యేలా..
జగదేవ్‌పూర్ మండలంలోని 29 గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 28 ప్రాథమిక పాఠశాలలు, 10 జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల్లో మొత్తం 2380 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీ నిధుల ద్వారా పలు పాఠశాలల్లో మరమ్మతు పనులు చేయించారు. అందులో భాగంగా మండలంలోని కొన్ని పాఠశాలల్లో తరగతి గదుల గోడలకు పాఠాల చిత్రాలు వేయించారు. తిగుల్, ఇటిక్యాల, రాయవరం, జగదేవ్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి పిల్లలతో పాటు అన్ని తరగతుల పిల్లలకు అర్థమయ్యేలా చిత్రాలు వేయించారు. అన్ని సబ్జెక్టులతో కూడిన బొమ్మలు వేశారు. జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణితశాస్త్రంతో పాటు జనరల్ చిత్రాలు కూడా వేశారు. భారతదేశం, తెలంగాణ చిత్రపటం, జాతీయ, రాష్ట్ర పక్షులు, అడవి జంతవులు, పిల్లలు ఆటలాడే చిత్రాలు వేయించారు. పుస్తకాల కంటే పిల్లలకు గోడలపై వేసిన బొమ్మలే సులువుగా అర్థమవుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. కాగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ఫ్రైమరీ ప్రారంభిస్తామని చెప్పడంతో వాటికి అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు.
విద్యార్థులకు గోడలపై వేసిన చిత్రాలే పాఠాలు అవుతున్నాయి. ఉపాధ్యాయులు బోధించడం కన్నా..చూసి నేర్చుకోవడం పిల్లలకు సులువు అవుతుంది. పిల్లలకు అర్థమయ్యే విధంగా మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలల్లో తరగతి గదుల గోడలపై చిత్రాలు వేయించారు.
జగదేవ్‌పూర్(గజ్వేల్)
పిల్లలకు అర్థమయ్యేలా..
అమ్మ ఆదర్శ కార్యక్రమంలో పాఠశాలలో వసతులు కల్పించారు. అందులో భాగంగా తరగతి గోడలపై బొమ్మలు వేయించాం. చిన్న పిల్లలు బొమ్మలను చూసి పాఠాలు నేర్చుకుంటున్నారు. అలాగే జనరల్ నాలెడ్జ్‌కు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
– శంకర్, ప్రధానోపాధ్యాయుడు, ఇటిక్యాల

చిత్రాలే.. పాఠాలై..

చిత్రాలే.. పాఠాలై..