
విద్యుదాఘాతంతో గేదె మృతి
శివ్వంపేట(నర్సాపూర్): విద్యుదాఘాతంతో గేదె మృత్యువాత పడింది. ఈ ఘటన మండల పరిధిలోని కాలేరాం తండాలో ఆదివారం చోటుచేసుకుంది. బీమ్లా తండాకు చెందిన కేతవాత్ రమే్‌శ తన గేదెలను రోజువారీగా పొలం వద్దకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో గేదె మేత మేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందింది. గేదె విలువ రూ.40 వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు.
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
పటాన్‌చెరు టౌన్ : గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సుభాష్ వివరాల ప్రకారం... ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి శివారు పాశమైలారం రోడ్డులో రేణుక ఎల్లమ్మ దేవస్థానం పక్కన హైటెన్షన్ స్తంభానికి కేబుల్ వైర్‌తో ఉరివేసుకొని కుళ్లిన స్థితిలో ఆదివారం వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయసు 30 నుంచి 40 ఏళ్లు ఉంటాయని, మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో గుర్తించడం కష్టంగా మారిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి చేతికి రాగి కడియం ఉంది.
వర్షానికి కూలిన ఇళ్లు..
చిన్నశంకరంపేట(మెదక్): వర్షాలతో పలువురి ఇళ్లు కూలిపోయాయి. మండల కేంద్రంలోని డప్పు లక్ష్మి నర్సింహులు ఇల్లు ఒకవైపు గోడ కూలిపోయింది. దీంతో పైకప్పు ఎప్పుడు కూలుతుందోనని భయాందోళన చెందుతున్నారు.అలాగే రుద్రారం గ్రామంలో తొర్రి సత్తయ్య ఇల్లు కూలిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.
ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
న్యాల్‌కల్(జహీరాబాద్): ఐదుగురు పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. హద్నూర్ ఎస్‌ఐ దోమ సుజిత్ కథనం ప్రకారం... ఖలీల్‌పూర్ గ్రామ శివారులో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి చెరకు తోటలో కొందరు పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేశారు. ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.17వేలు నగదు, పేకాట ముక్కలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సుజిత్ మాట్లాడుతూ.. మండలంలో ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.
గోవా మద్యం పట్టివేత
మునిపల్లి(అందోల్): నిబంధనలకు విరుద్ధంగా తీసుకువస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ వీణారెడ్డి కథనం ప్రకారం... ఆదివారం మండలంలోని కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ట్రావెల్ బస్సులో తీసుకువస్తున్న 6.5 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని, ఇద్దరిని అరెస్టు చేశారు.
గంజాయి స్వాధీనం..
గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా.. కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి 1250 గ్రాముల ఎండు గంజాయి దొరికింది. హైదరాబాద్ మూసాపేటకు చెందిన శ్రీధర్, దనుంజయా బెహర కర్నాటక లోని బీదర్‌లో ఇరాని గల్లీలో గంజాయి కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. వారి వద్ద నుంచి హోండా యాక్టీవా, ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.