
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన తెల్లాపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. కొల్లూరు పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన రాకే్‌శ్ కుమార్ రెడ్డి(24) జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చాడు. తెల్లాపూర్‌లో యానిమాల్ కేర్ సెంటర్‌ను నిర్వహిస్తున్న గోపన్‌పల్లికి చెందిన సంధ్యారాణి వద్ద నాలుగు ఏళ్లుగా యానిమల్ కేర్ టేకర్‌గా రాకేశ్ కుమార్ రెడ్డి పని చేస్తున్నాడు. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన అతడు తన యాజమాని సంధ్యారాణి వద్ద సుమారు రూ.6లక్షల వరకు అప్పు చేశాడు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం ఆమె రాకేశ్ కుటుంబ సభ్యులకు తెలియజేసింది. కాగా శనివారం రాత్రి తనకు కొంత అప్పు కావాలని యజమానిని అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య స్వల్పంగా మాటామాట పెరిగింది. ఆగ్రహంతో రాకేశ్ కుమార్ రెడ్డి కర్ర తీసుకుని సంధ్యారాణిపై దాడి చేశాడు. ఆమె తలకు గాయం కావడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్న అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి రాగా అప్పటికే అతడు పరారయ్యాడు. ఆదివారం ఉదయం తెల్లాపూర్ చెరువు వద్ద ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం వచ్చిన వెంటనే అక్కడికి చేరుకున్నారు. చెట్టుకు ఉరివేసుకున్నది రాకేశ్ కుమార్ రెడ్డి అని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాలువలోపడి యూపీ వాసి..
హవేళిఘణాపూర్(మెదక్): ఓ వ్యక్తి కాలువలో పడి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మెదక్ మండల పరిధిలోని మాచవరం శివారులో ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా... ఉత్తరప్రదేశ్ సియో జిల్లా ఇండ్రాయికి చెందిన రాజేశంపాండే(34) మాచవరం గ్రామ శివారులో కూలీ పని నిమిత్తం వచ్చాడు. శుక్రవారం సాయంత్రం అతడు పక్కనే ఉన్న ఎంఎన్ కెనాల్ కాలువ సమీపంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి కాలు జారి పడ్డాడు. దీంతో తోటి కూలీలు వెతికినా అతడు కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంఎన్ కెనాల్ కాలువ ఉధృతి ఎక్కువగా ఉండటంతో మెదక్ రూరల్ ఎస్‌ఐ మురళి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నీటిని నిలిపివేయించారు. కాగా ఆదివారం ఉదయం కాలువలో రాజేశంపాండే మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.