
పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
చేర్యాల(సిద్దిపేట): పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మండల పరిధిలోని నాగపురి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సాంబని కనకయ్య అదే గ్రామంలో ఓ భూ వివాదానికి సంబంధించి గతంలో జరిగిన గొడవ ఫొటోలను వాట్సాప్ గ్రూపులో పోస్ట్‌చేశాడు. విషయమై ఫొటోల్లో ఉన్న వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం కొమురవెల్లి పోలీసులు స్టేషన్‌కు పిలిపించి మందలించి పంపించారు. ఆదివారం ఉదయం కనకయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై ఎస్‌ఐ రాజుగౌడ్‌తో మాట్లాడగా అతడిపై వచ్చిన ఫిర్యాదు మేరకు పిలిచి మాట్లాడి పంపించామని తెలిపాడు.
మంజీరా నదిలో యువకుడి గల్లంతు
పాపన్నపేట(మెదక్): మంజీరా నదిలో యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన మండల పరిధిలోని ముద్దాపూర్ బ్రిడ్జి వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ తుక్కయ్య కథనం మేరకు... మండల పరిధిలోని బాచారం గ్రామానికి చెందిన శాయిబాజ్ (25) మెదక్‌లోని ఆర్‌టీఏ బ్రోకర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఆరుగురు స్నేహితులతో కలిసి ముద్దాపూర్ బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. అక్కడ చేపలు పట్టే క్రమంలో మంజీరా ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీటిలో కొట్టుకుపోయాడు. కాగా సాయంత్రం వరకు అతని ఆచూకీ దొరక లేదు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత అదృశ్యం
రామాయంపేట(మెదక్): వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన రామాయంపేట పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన చాకలి సుజాత ఈనెల 25న ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. ఆమె సెల్‌ఫోన్ సైతం ఇంటి వద్దే వదిలి వెళ్లింది. ఈ మేరకు సుజాత కూతురు దుర్గాభవాని పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నారు.