
కనీస వేతనాలు అమలు చేయాలి
దుబ్బాకటౌన్: ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు భూపాల్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో శానిటేషన్, కేర్ టేకర్, సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులు ఆదివారం ఆయన సమక్షంలో సీఐటీయూలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆస్పత్రిలో పని చేస్తున్న కార్మికులకు పూర్తి స్థాయి వేతనాలు చెల్లించకుండా కాంట్రాక్లర్లు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల వేతనాల నుంచి కాకుండా ప్రభుత్వమే నేరుగా పీఎఫ్‌ను జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ. 26 వేల కనీస వేతనం అందజేయాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నామని సీఐటీయూ జిల్లా కోశాధికారి గొడ్డుబర్ల భాస్కర్ తెలిపారు. అధ్యక్షురాలిగా లావణ్య, కార్యదర్శిగా ఇందిర, కోషాధికారిగా మహిపాల్, ఉపాధ్యక్షులుగా నవీన్ కుమార్, బాలాలక్ష్మిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కన్వీనర్ భాస్కర్, నాయకులు రాజు, ఎండీ. సాజిత్, కార్మికులు పాల్గొన్నారు.