
కర్ణాటకకు 42 బోగీల బియ్యం రవాణా
సిద్దిపేటఅర్బన్: కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా సిద్దిపేట నుంచి కర్ణాటకకు 42 రైలు బోగీల నిండా బియ్యాన్ని రవాణా చేసినట్టు ఎఫ్‌సీఐ అధికారులు తెలిపారు. సిద్దిపేటలోని గూడ్స్ రైల్వే షెడ్ నుంచి కర్ణాటకలోని కొప్పల్ ఎఫ్‌సీఐ ఫుడ్ స్టోరేజీ డిపోకు ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్‌తో కూడిన రైలును విజయవంతంగా రవాణా చేయడం పట్ల అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. హబ్సీపూర్‌లోని ఎస్‌డబ్ల్యూసీ గోదాం నుంచి 90కి పైగా ట్రక్కుల ద్వారా రైల్వే లోడింగ్ పాయింట్‌కు తరలించగా 200 మంది కూలీలు బోగీలలో లోడింగ్ చేసినట్టు పేర్కొన్నారు. వర్షం వల్ల బస్తాలు తడిసిపోకుండా ఉండేందుకు కాంట్రాక్టర్ పాలిథిన్ షీట్ వేసి జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. వరి దిగుబడి ఎక్కువగా ఉన్న తెలంగాణ నుంచి తక్కువ ఉత్పత్తి కలిగిన కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఝార్ఖండ్, బీహార్ వంటి రాష్ట్రాలకు తరలించినట్టు పేర్కొన్నారు.