
బాబును ఇవ్వాలని మహిళకు బెదిరింపులు
క్షేమంగా సొంత గ్రామానికిపంపించిన పోలీసులు
హుస్నాబాద్: చిన్న బాబుతో భిక్షాటన చేస్తున్న ఓ మహిళను రూ.500 ఇచ్చి బాబును ఇవ్వా లని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. ఈ ఘటన శుక్రవారం హుస్నాబాద్‌లో చోటు చేసుకుంది. పట్టణంలోని తెలంగాణ కాంప్లెక్స్‌లో తన బాబుతో ఓ మహిళ భిక్షాటన చేస్తున్న సమయంలో బాబును ఇవ్వాలని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన ఆ మహిళ బాబుతో ఏడ్చుకుంటూ బస్టాండ్‌కు చేరుకుంది. ఇది గమనించిన ప్రయాణికులు బస్టాండ్ సెక్యూరిటీ గార్డు వెంకటేష్‌కు సమాచారం అందించారు. ఆయన పోలీసులకు చెప్పారు. వెంటనే అక్కడికి వచ్చిన బ్లూ కోట్ సిబ్బంది కుమార్, సంపత్ మహిళ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తరిగొప్పుల గ్రామానికి చెందిన కోమలగా గుర్తించారు. వెంటనే మహిళను, ఆమె బాబును బస్టాండ్ నుంచి వయా తరిగొప్పుల మీదుగా జనగామ వెళ్లే బస్సు ఎక్కించి ఆ గ్రామానికి వెళుతున్న ప్రయాణికులకు చెప్పి పంపించారు. గ్రామానికి మహిళ చేరుకునే వరకు ఎస్సై లక్ష్మారెడ్డి మానిటరింగ్ చేశారు.