
పురుగుల అన్నం తినేదెట్లా?
విద్యార్థుల ఆందోళన
● హాస్టల్‌ను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి
సంగారెడ్డి : తాము తింటున్న అన్నం బాగాలేదని, అందులో పురుగులు వస్తున్నాయని బొమ్మరెడ్డిగూడెం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. వారం రోజులుగా భోజనంలో పురుగులు వస్తున్నాయని తమ సమస్యను వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. పురుగులతో కూడిన అన్నం కాకుండా నాణ్యమైన భోజనం వడ్డించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. హాస్టల్ వార్డెన్ వైఖరిపై మండిపడ్డారు. గిరిజన పాఠశాల విద్యార్థుల ఆందోళనపై స్పందించిన మండల స్పెషల్ ఆఫీసర్ వసంత కుమారి, ఎంపీడీఓ శంకర్ పాఠశాలను సందర్శించారు. సివిల్ సప్లై బియ్యంలో పురుగులు ఉన్నాయని నిర్ధారించి వాటిని వాపస్ చేసి కొత్త బియ్యంతో అన్నం వండించారు. ఇకపై నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే హాస్టల్ వాతావరణం పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
గిరిజన పాఠశాల వార్డెన్ సస్పెన్షన్
సంగారెడ్డి జోన్: చౌటకూర్ మండలంలోని బొమ్మరెడ్డి గూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్ శోభను కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సంక్షేమ అధికారి అఖిలేష్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు బియ్యం శుభ్రం చేయకుండా వంటలు చేసి వడ్డించడంతో అన్నంలో పురుగులు వస్తున్నట్లు విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. దీంతో విచారణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక సమర్పించినట్లు తెలిపారు. వార్డెన్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలడంతో సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.