మెదక్ కలెక్టరేట్: రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించి, సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మెదక్‌లో ఎస్‌ఎఫ్‌ఐ వర్క్‌షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువ చదువుతున్నట్లు చెప్పారు. విద్యార్థులకు స్కాలర్షిప్స్ విడుదల కాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయక పోవడంతో పేద విద్యార్థులు అర్ధాకలితో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అలాగే మెదక్ జిల్లాలో విద్యార్థులు ఉన్నత విద్యా చదువుకోవడానికి పీజీ ఇంజనీరింగ్ కళాశాలలు లేక ఇతర జిల్లాలకు వలస వెళ్లాల్సి వస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్‌లు స్పందించి పీజీ ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరు చేయాలన్నారు. అలాగే జిల్లాలో ఎస్సీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మెదక్ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, తూప్రాన్ డివిజన్ కార్యదర్శి ఆంజనేయులు, రామాయంపేట డివిజన్ అధ్యక్షులు అజయ్ కుమార్, మెదక్ మండల అధ్యక్షులు నోముల అజయ్ కుమార్ తదితర మండల నాయకులు. విద్యార్థులు పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ ఉపాధ్యక్షుడు కిరణ్ డిమాండ్