
మహిళా సంఘాలకు ఊరట
ఆరు నెలల వడ్డీ విడుదల
● రూ. 19.47 కోట్లు జమ ● హర్షం వ్యక్తం చేస్తున్న మహిళా సంఘాల సభ్యులు ● నేరుగా సభ్యుల ఖాతాల్లో జమ
నియోజకవర్గాల వారీగా విడుదలైన వడ్డీ (రూ.కోట్లలో)
నియోజకవర్గం సంఘాలు మొత్తం
అందోల్ 3,151 4.27
నారాయణఖేడ్ 2,682 3.01
నర్సాపూర్ 906 1.28
పటాన్‌చెరు 2,424 3.53
సంగారెడ్డి 2,679 3.75
జహీరాబాద్ 3232 3.62
సంగారెడ్డి జోన్ / సంగారెడ్డి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులోభాగంగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు వివిధ రకాల రుణాలకు సంబంధించిన వడ్డీ బకాయిలను విడుదల చేసింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉన్న మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు వివిధ రకాల రుణాలను మంజూరు చేస్తుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న వివిధ రకాల రుణాలు అందించడంతోపాటు వారు సద్వినియోగం చేసుకుని, లాభాలు వచ్చే వ్యాపారాలు నిర్వహించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టుకున్నారు. సీ్త్ర నిధి, బ్యాంకు లింకేజీ, సీఐఎఫ్‌తో పాటు వివిధ రకాల రుణాలను అందిస్తుంది.
నేరుగా రూ.19.47 కోట్ల జమ
జిల్లావ్యాప్తంగా ఉన్న స్వయం శక్తి మహిళా సంఘాలకు రూ.19.47 కోట్ల వడ్డీని విడుదల చేసింది. విడుదలైన వడ్డీ నిధులు నేరుగా మహిళా ఖాతాల్లో జమ కానున్నాయి. గత ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న వడ్డీ బకాయిలను విడుదల చేసింది. సభ్యులు తీసుకున్న రుణాలతోపాటు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో కొన్నేళ్లపాటు వడ్డీ డబ్బులు నిలిపివేసింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు వడ్డీ డబ్బులు కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ బకాయిలను విడుదల చేస్తోంది. వడ్డీ డబ్బులు ఖాతాల్లో జమ కావడంతో మహిళా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారవేత్తలుగా ఎదగాలి
గ్రామీణ ప్రాంతంలోని మహిళలు వ్యాపారవేత్తలగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో వివిధ రకాల శిక్షణాలను ఇస్తూవివిధ రుణాలను అందజేస్తున్నాము. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న పథకాలు మహిళలకు గ్రామీణ ప్రాంతాలలోనే ఉంటూ వారికి జీవనోపాధి కలిగించడానికి అవకాశాలు కల్పిస్తున్నాం.
– సూర్యారావ్,అదనపు డీఆర్డీఓ
మహిళా ప్రగతి పథం
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు అభివృద్ధిచెందేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల పథకాలను ప్రవేశపెడుతున్నాయి. మహిళా సంఘాల్లోని మహిళలు వ్యాపారవేత్తలుగా అన్ని రంగాల్లో ముందు ఉండేందుకు వారికి ఉచిత శిక్షణలనిస్తూ ఉపాధి కల్పిస్తున్నారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకం (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) ద్వారా స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసి వారికి ఆర్థిక సహాయం, శిక్షణను
అందజేస్తోంది.
విద్యుత్ బైక్‌లు, ఫిష్ వ్యాన్లు...
జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతంలోని మహిళా సంఘాలకు కేంద్రం నుంచి రూ.2.20కోట్లు రానున్నాయి. ఇందులో భాగంగా మహిళల సంఘాలకు చేప పిల్లలు అమ్మడానికి ఎలక్ట్రికల్ బైకులు, మొబైల్ ఫిష్ వ్యాన్లు, మదర్ యూనిట్లు, గొర్రె పిల్లల పెంపకం వంటి వాటిని అందజేయనున్నారు. కోడి పిల్లలను పెంచేందుకు రుణాలను అందించనున్నారు. జిల్లాలో మహిళా సంఘంలోని సభ్యులకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఇవ్వనున్నారు. వీటి ద్వారా మహిళా సంఘాల సభ్యులు మరింత లబ్ధి పొందనున్నారు. జిల్లాలోని 695 గ్రామాలలో 25 మండలాల్లో ఒక 1.95లక్షల మహిళలకు వివిధ రూపాలలో పథకాలను అందించి లబ్ధి చేకూర్చనున్నారు.

మహిళా సంఘాలకు ఊరట