
ఐదు విడతల్లో ఎన్నికలు!
ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు
● సిబ్బందిని సరిచూసుకోమని ఈసీ ఆదేశం ● ఇదివరకే సిబ్బంది నియామకం ● బదిలీలు, పదోన్నతుల్లో మార్పుల పరిశీలన ● ఎన్నికల సామగ్రి సరిచూస్తున్న అధికారులు
నారాయణఖేడ్: స్థానిక సంస్థల పోరుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశించడం, ప్రభుత్వం కూడా పంచాయతీరాజ్ శాఖను ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అయితే ఈ ఎన్నికలను ఐదు విడతల్లో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. వర్షాకాలం అయినందున ఎన్నికల నిర్వహణకు ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా ఐదు విడతలుగా నిర్వహించాలని భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా విడతల వారీగా నిర్వహిస్తే శాంతి భద్రతల నిర్వహణ, గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు పోలింగ్ సిబ్బంది, పోలిసుల తరలింపు సుళువవుతుందని, పర్యవేక్షణలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. ప్రభుత్వం రిజర్వేషన్ల సమాచారం ఇవ్వగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీకి ఒకే రోజు పోలింగ్ జరగనుంది.
అధికారుల్లో మొదలైన కదలిక
ఎన్నికలకు అవసరమైన సిబ్బంది, మెటీరియల్‌ను సిద్ధం చేసుకోవాలన్న సూచనలతో అధికారుల్లో కదలిక మొదలైంది. జిల్లా 26 జెడ్పీటీసీ, 26 ఎంపీపీ, 271 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో 7,83,379 ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ సిబ్బంది డేటాను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం తాజాగా ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది వివరాలను మరోసారి పరిశీలించాలని ఈ సందర్భంగా ఈసీ సూచించింది. అలాగే జిల్లా, రెవెన్యూ, వార్డుల సంఖ్య ఆధారంగా పూర్తి వివరాలతో అందుబాటులో ఉండాలని కూడా సూచించింది.
డేటా సరిచూసుకుంటున్న అధికారులు
కాగా, ఎన్నికల నిర్వహణకు నియామకం అయిన ఎన్నికల సిబ్బంది వివరాలను జిల్లా అధికారులు సరిచూసుకుంటున్నారు. ఇటీవల బదిలీలు, పదోన్నతులు, రిటైర్మెంట్లు అయిన సిబ్బంది ఎవరైనా ఉంటే వారి స్థానంలో మరో అధికారి నియామకం గూర్చి వివరాలను సేకరిస్తున్నారు. మండలంలో ఉన్న రెండు లేదా మూడు ఎంపీటీసీలకు ఒక రిటర్నింగ్ అధికారి (గెజిటెడ్ అధికారి), ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని నియమించి వారికి కేటాయించిన కేంద్రంలో వీరు నామినేషన్ల స్వీకరణ, స్క్రూటిని, తిరస్కరణ, అంగీకరణ, పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం చేపట్టనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి, ఐదుగురు పోలింగ్ అధికారులను నియమించారు. ఎన్నికల నిర్వహణకు ఆర్డీఓ పరిధిలో ఎంపీడీఓ, తహసీల్దార్, రూట్ అధికారులు, ఎంసీసీ, వీడియోగ్రఫీ, ఎన్నికల అభ్యర్థి వ్యయం లెక్కింపు, అక్కౌంట్స్ బృందాలు పనిచేయనున్నాయి. పోలింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు.
సామగ్రి తనిఖీ..
ఎన్నికలకు సంబంధిచి సేకరించిన సామగ్రి తనిఖీ చేసి వాటి పనితీరుపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జిల్లా పరిషత్, జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బ్యాలెట్ బాక్సులతోపాటు, బ్యాలెట్ పేర్లకు అవసరమైన గులాబీ, తెలుపు రంగు పేపర్స్, పేపర్ సీల్స్, అడ్రస్‌ట్యాగ్‌లు, హ్యాండ్‌బుక్‌లు, స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ ఫామ్స్, కవర్స్ ఇదివరకే సరఫరా కాగా వాటిని పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నారు.