
వర్షాలతో సాగు జోరు
● జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వానలు ● సంతోషంలో అన్నదాతలు
న్యాల్‌కల్(జహీరాబాద్): చక్రవాత ఆవర్తన ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. శుక్ర వారం భారీ వర్షం కురవగా శనివారం మధ్యాహ్నం కూడా అంతేస్థాయిలో వర్షం కురిసింది. 13 రోజుల తర్వాత వర్షాలు కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వానలు లేక పంటలు దెబ్బతింటున్న తరుణంలో వర్షాలు కురవడం వల్ల పంటలకు ప్రాణం పోసినట్లయింది. జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో రెండు రోజులుగా వానలు కురుస్తుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
వర్షపాతం ఇలా...
జిల్లాలో శుక్రవారం 30మిల్లీ మీటర్ల భారీ వర్షం కురవగా, శనివారం కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా మరి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్ష పాతం నమోదైంది. కంగ్టిలో 72 మిల్లీ మీటర్లు, న్యాల్‌కల్‌లో 35.5, వట్‌పల్లిలో 29.8, పుల్‌కల్‌లో 21.3, జహీరాబాద్‌లో 15మిల్లీ మీటర్ల అధిక వర్ష పాతం నమోదు కాగా, మిగతా ప్రాంతాల్లో తక్కువ వర్ష పాతం నమోదైంది. జూలై 1న, 2న రెండు రోజుల పాటు 49.6 మిల్లీ మీటర్లు అధిక వర్షం కురవగా 3న స్వల్ప వర్షపాతం నమోదైంది.
7.50 లక్షల ఎకరాల్లో సాగు!
ఈ ఏడాది జిల్లాలో 7.50 లక్షలు ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఐతే ఇప్పటి వరకు 5,46,257 ఎకరాల్లో పంటలను రైతులు సాగు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా 3,40,799 ఎకరాల్లో పత్తి పంట, 54,528 ఎకరాల్లో సోయా, 57,442 ఎకరాల్లో కంది, 27,193 ఎకరాల్లో వరి సాగు చేసుకోగా మిగిలిన 66,295 ఎకరాల్ల్లో పెసర, మినుము, చెరకు తదితర పంటలను రైతులు సాగు చేసుకున్నారు. జూలై ప్రారంభంలో కురిసిన వర్షం వల్ల పంటలకు ప్రాణం పోసినట్లైంది. రెండు వారాలుగా వర్షాల జాడ లేకపోవడంతో సాగు చేసుకున్న పంటలు దెబ్బతింటుండటంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. పంటల్లో కలుపు తీసిన రైతులు వర్షం పడితే ఎరువులు వేసుకోవచ్చనే ఆశతో ఎరువులను సైతం సిద్ధంగా ఉంచుకున్నారు. చక్రవాత ప్రభావం వల్ల రెండు రోజులుగా వర్షం కురుస్తుండటంతో రైతులు పొలం బాట పట్టారు. సిద్ధంగా ఉంచుకున్న ఎరువులను పంటలకు వేసే పనిలో నిమగ్నమయ్యారు. చాలా రోజుల తర్వాత వర్షం పడడంతో పంటలకు ప్రాణం పోసినట్లయిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పంటలకు మేలైంది
25 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసుకున్నాను. రెండు వారాలుగా వానలు పడకపోవడంతో పంట దెబ్బతింటుందని భయపడ్డాను. తాజా వర్షాలతో పంటలకు చాలా మేలైంది. –రాజప్ప, రైతు, చాల్కి