
ఆర్టీసీలో అప్రెంటీస్ మేళా
సంగారెడ్డి టౌన్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని నిరుద్యోగులకు డిగ్రీ పట్టభద్రులకు డిపో పరిధిలోని మూడేళ్లపాటు అప్రెంటిస్ నిర్వహిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ విజయ భాస్కర్ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇంజనీరింగ్ ఇన్ ఐటీ, కంప్యూటర్ సైన్స్‌లో 2021లో ఉత్తీర్ణులైనవారు ఈ అప్రెంటీస్‌కు అర్హులని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 21 నుంచి 27 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు.
రైతులకు
అందుబాటులో ఉంటా
ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి
జహీరాబాద్: ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండి తగిన మేరకు సేవలందిస్తానని ఆత్మకమిటీ చైర్మన్ పి.రామలింగారెడ్డి పేర్కొన్నారు. జహీరాబాద్‌లోని పీవీఆర్ గార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో ఆత్మ కమిటీ చైర్మన్‌గా రామలింగారెడ్డితో పాటు సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను తీసుకుంటున్నారన్నారు. ఇవి రైతులకు చేరేవిధంగా పాటుపడతానని చెప్పారు. తన నియామకానికి సహకరించిన వారిందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మ చైర్మన్, సభ్యులను ఎంపీ సురేశ్ షెట్కార్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి, ఐడీసీ మాజీ చైర్మన్ ఎం.డి.తన్వీర్‌లు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆయా మండలాల ఏఓలు లావణ్య, అవినాష్‌కుమార్, వెంకటేశ్, అస్ముద్దీన్, వినోద్‌కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
డంప్‌యార్డ్‌పై
కొనసాగుతున్న నిరసనలు
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు 165వ రోజుకు చేరుకున్నాయి. నల్లవల్లి గ్రామంలో ఏర్పాటు చేపిన రిలే నిరాహార దీక్షలో స్థానిక మహిళలు పాల్గొని నిరసన వ్యక్త చేశారు. సుమారు ఐదు నెలలుగా డంపింగ్ యార్డ్ వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. డంపింగ్‌యార్డ్ నిర్మాణ పనులు నిలిపే వరకు తమ ఆందోళనలు ఆపేదిలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి అధికారుల
పనితీరుపై ఆగ్రహం
ఝరాసంగం(జహీరాబాద్): ఉపాధి హామీ అధికారులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన ఝరాసంగం మండలప్రజాపరిషత్తు కార్యాలయంలో ఉపాధి హామీ అదనపు డీఆర్‌డీఓ బాల్‌రాజ్ శనివారం చేపట్టిన 15వ విడత సామాజిక తనిఖీలో పలువురు అధికారులు అవకతవకలకు పాల్పడినట్లు వెల్లడైంది. పలు గ్రామాల్లో ఉపాధి అధికారులు చేపట్టని పనులకు బిల్లులు చేయటం, గ్రామ పంచాయతీల్లో పనులు చేసిన వారికి కూలి చెల్లించటం, మస్తర్లలో కొట్టివేతలు, పనుల కొలతల్లో తేడాలు, చేపట్టిన పనుల కంటే అధికంగా బిల్లులు చేయటంతో పాటు వివిధ రకాల అక్రమాలకు పాల్పడినట్లు తనిఖీ బృందం సభ్యులు గుర్తించారు. దీంతో రూ.27వేల రికవరికి ఆదేశాలు జారీ చేస్తూ పలువురు అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓలు సుధాకర్, మంజుల, ఏపీఓ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీలో అప్రెంటీస్ మేళా

ఆర్టీసీలో అప్రెంటీస్ మేళా