
హామీలు అమలు చేయాలి
సిద్దిపేటజోన్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వికలాంగులకు రూ.6వేల పింఛన్ ప్రకటించి, అమలు చేయలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక మెట్రో గార్డెన్‌లో ఆగస్టు13న వికలాంగుల పోరాట సమితికి మద్దతుగా నిర్వహించనున్న ఛలో హైదరాబాద్ మహా గర్జన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వికలాంగులకు 20 నెలలుగా పింఛన్ పెంపు హామీ అమలు కావడం లేదన్నారు. ఎన్నికల హామీ అమలుకు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయలేదన్నారు. ఇస్తామన్న కాంగ్రెస్ ఇవ్వలేదని, అడగాల్సిన ప్రతిపక్షాలు అడగలేదని విమర్శించారు. వికలాంగులకు ఇవ్వాల్సిన రూ.20 వేల కోట్లను ప్రభుత్వం రుణమాఫీ కింద ఇచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ మేరకు కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు డబ్బులు పడలేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరాం, నాయకులు శంకర్,తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ