
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య
బెజ్జంకి(సిద్దిపేట): ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సౌజన్య కథనం మేరకు... గూడెం గ్రామానికి చెందిన ఎగోల్ల రాజేశం(39) గతంలో ఉపాధి కోసం రెండేళ్లు దుబాయి వెళ్లి వచ్చాడు. తరువాత బేగంపేటలో సొంతంగా ఇల్లు నిర్మించుకుని ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఇంటి నిర్మాణం కోసం చేసిన బాకీలకు తోడు ఆటో నడవకపోవడంతో ఇంటి నిర్వహణ ఖర్చులు పెరిగిపోయి అప్పులయ్యాయి. వాటిని తీర్చ మార్గంలేక బాధపడుతూ మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం తన ఆటోలో ఇంటి నుంచి వెళ్లాడు. క్రిమి సంహారక మందు తాగి బంధువులకు సమాచారమిచ్చాడు. వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య భాగ్యలక్ష్మి, కూతుర్లు నిహారిక, హర్షితలున్నారు. అన్న మల్లేశం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదువు మానేయాలన్నందుకు బాలిక
రామాయంపేట, నిజాంపేట(మెదక్): కూతురును చదువు మానేయాలని తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడింది. నిజాంపేట పోలీసుల కథనం మేరకు... గ్రామానికి చెందిన మహమ్మద్ సులేమాన్, హమీద దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ సులేమాన్ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండో కూతురు మదిహా(15) పదో తరగతి పాసైంది. కామారెడ్డి మైనారిటీ కళాశాలలో ఇంటర్ సీట్ వచ్చింది. ఆర్థిక పరిస్థితి బాగాలేదని, చదువు వద్దని పలుమార్లు ఆమె తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన మదిహా బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాజేశ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య