
జనం కోసమే కమ్యూనిస్టు పార్టీ
హుస్నాబాద్ : జనం కోసమే కమ్యూనిస్టు పార్టీ పుట్టిందని, త్యాగ గుణం ఉన్న వారే ఈ పార్టీలో ఉంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు పేర్కొన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని ఓ గార్డెన్‌లో సీపీఐ జిల్లా 4వ మహాసభలు నిర్వహించారు. అంతకుముందు అంబేడ్కర్ చౌరస్తా నుంచి గార్డెన్ వరకు డప్పు చప్పుళ్లతో సీపీఐ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సాంబశివ రావు మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమ చరిత్రలో కమ్యూనిస్టులు లేని పేజీ అంటూ ఉండదన్నారు. అడవిలో ఉండి ప్రజల కోసం పని చేసే మావోయిస్టులను కాల్చి చంపడం సరికాదన్నారు. కమ్యూనిస్టులన్నా, ఎర్ర తిలకం అన్న బీజేపీకి భయమన్నారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయకుండా విస్మరించారన్నారు. కట్టను పూర్తి చేసి కాలువలను తవ్వలేదన్నారు. కమ్యూనిస్టులను ఏరివేయాలని మోదీ ప్రయత్నిస్తున్నాడని, ప్రశ్నించే గొంతుకలు ప్రజాస్వామ్యంలో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు శంకర్, జిల్లా కార్యదర్శి మంద పవన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు శంకర్, లోక్‌సత్తా జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మల్లేశ్, నాయకులు వెంకట్రాంరెడ్డి, సత్యనారాయణ, వనేష్, కొమురయ్య, లక్ష్మణ్, జనార్దన్, రాజ్‌కుమార్, పద్మ ఉన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివ రావు