
కాళేశ్వరం నీటి సర్వేకు రూ.108.50 కోట్లు
జోగిపేట (అందోల్): కాళేశ్వరం నుంచి సింగూరు ప్రాజెక్టులోకి 20 టీఎంసీల నీటిని తరలింపునకు కాళేశ్వరం నీటి సర్వే పనులకు ప్రభుత్వం రూ.108.50 కోట్ల నిధులను మంజూరు చేసిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు పట్లోళ్ల సంగమేశ్వర్ తెలిపారు. కాళేశ్వరం నీటి సర్వే పనులు పూర్తయ్యేందుకు రూ.1000 కోట్లు అవుతుందని, దీనికోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.108.50 కోట్ల నిధులతో రూపొందించే సర్వే పనులు రెండు మూడు నెలల్లో పూర్తయితే, పెద్దరెడ్డిపేట వద్ద రూ.1000 కోట్ల నిధులతో చేపట్టబోయే సింగూరు కాల్వ పనులకు సీఎం రేవంత్ రెడ్డితో శంకుస్థాపన చేయిస్తామని తెలిపారు. ఈ సర్వే పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. ఈ పనులు పూర్తయితే నియోజకవర్గంలోని అందోల్, వట్‌పల్లి, రేగోడు, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాల పరిధిలో ఉన్న రైతాంగానికి 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. సమావేశంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మక్త జగన్మోహన్‌రెడ్డి, అందోల్, టేక్మాల్ పార్టీ అధ్యక్షుడు శివరాజ్, నిమ్మ రమేశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, మాజీ వైస్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
త్వరలో సింగూర్ పనులకు
సీఎంతో శంకుస్థాపన
టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్