
డీఎస్‌ఆర్‌తో రైతులకు మేలు
నారు, నాట్లు లేకుండానే నేరుగా వరి సాగు
● నీటి వినియోగం, కూలీల ఖర్చు ఆదా ● జిల్లాలో వంద ఎకరాల్లో పంట ● అవగాహన కల్పిస్తున్నవ్యవసాయాధికారులు
మండలంలో ఆరు ఎకరాల్లో డీఎస్‌ఆర్ (డైరెక్ట్ సీడెడ్ రైస్) విధానం కొనసాగుతుంది. నేరుగా వరి విత్తనాలు తడి, పొడి నేలల్లో విత్తుకునే అవకాశం ఉండగా, జిల్లా రైతులు పొడి నేలల్లోనే ఎక్కువగా, డ్రమ్‌సీడర్ సహాయంతో విత్తుకుంటున్నారు. కాగా తడి నేలల్లో విత్తనాలు వేసే రైతులు ముందుగా నీళ్లల్లో నానబెట్టి, బురదలో చల్లుకోవచ్చు. గతంలో పంట కోసిన అనంతరం నేలను రెండుసార్లు దుక్కి దున్ని, రోటావేటర్ చదును చేసిన తర్వాత, ట్రాక్టర్‌తో నేలలో 2 నుంచి 3 సెం.మీ. లోతు సాళ్లు తీసుకుని, నేరుగా, లేదా డ్రమ్ సీడర్‌తోనైనా వరి విత్తనాలు వేసుకోవచ్చు. వరుసల మధ్య సుమారు 20 సెం.మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. ఎకరాకు సుమారు 10 నుంచి 12 కిలోల విత్తనాలు అవసరమవుతాయని, విత్తన ఎంపికలో వ్యవసాయాధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు. కలుపును మాత్రం సమయానికి తీయాలని, లేదంటే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. సస్యరక్షణ చర్యలు పాటిస్తే డీఎస్‌ఆర్‌తో అధిక దిగుబడులు సాధించవచ్చనితెలిపారు.
ప్రయోజనాలు
ఈ పద్ధతితో తూకం వేయడం, నారు మడులను సంరక్షించడం ఉండకపోవడంతో నీటి వినియోగం తగ్గుతుంది. నాటు వేయరు గనుక కూలీల ఖర్చు ఉండదు. నేలను అధిక భారంతో దున్నకపోవడంతో నిర్మాణం సక్రమంగా ఉంటుంది. రసాయనాల వినియోగం చాలావరకు తక్కువగా ఉండటంతో నేల సారవంతమవుతుంది. ఈ పద్ధతి వాతావరణ మార్పులకు అనుకూలంగా ఉండటంతో గ్రీన్‌హౌస్ వాయువులను తగ్గిస్తుంది. సాధారణ వరి సాగుతో పోలిస్తే పెట్టుబడి తక్కువ. పైగా సంప్రదాయ వరి సాగు కంటే పది రోజుల ముందే పంట చేతికొస్తుంది.
ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, నీటి వినియోగాన్ని అధికం చేసుకుంటూ, సంప్రదాయ వరి సాగు చేస్తున్న రైతులకు డీఎస్‌ఆర్ (వరి విత్తనాలను నేరుగా పొలంలో నాటడం)విధానంపై వ్యవసాయాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో జిల్లాలో ఇప్పటివరకు సుమారు 100 ఎకరాల్లో ఈ విధానంలో సాగు చేస్తున్నట్లు అంచనావేస్తున్నారు. చిలప్‌చెడ్(నర్సాపూర్):
తగ్గిన శ్రమ.. ఖర్చులు
అధికారుల సూచనల మేరకు మూడెకరాల్లో డీఎస్‌ఆర్ విధానంలో వరి సాగు చేశా. ప్రస్తుతం పంట బాగుంది. నీటి వినియోగం తగ్గడంతో పాటు, కూలీల అవసరం తగ్గింది. దీంతో చాలావరకు శ్రమ తగ్గింది. నారు, నాట్లు లేకపోవడంతో ఖర్చులు చాలా తగ్గాయి. గతంలో నాటేసే కూలీలకే ఎకరాకు 5 నుంచి 6 వేలకు ఇచ్చేవాళ్లం. సరైన దిగుబడి వస్తే ఈ పద్ధతినే కొనసాగిస్తా. – దేవేందర్‌రెడ్డి, రైతు, చండూర్
అవగాహన కల్పించాం
జిల్లా రైతులకు తమ సిబ్బంది డీఎస్‌ఆర్ పద్ధతిపై అవగాహన కల్పించారు. దీంతో ఆసక్తి ఉన్న పలువురు రైతులు ముందుకు వచ్చారు. ఈ విధానంలో రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. తక్కువ సాగు నీరు ఉన్న రైతులకు ఎంతో ఉపయోగం. పైగా పెట్టుబడి తక్కువ. పంటకాల వ్యవధి తక్కువ. మరింత మంది రైతులు ఈ విధానంలో సాగు చేయాలి. – కే.దేవ్‌కుమార్, డీఏఓ

డీఎస్‌ఆర్‌తో రైతులకు మేలు

డీఎస్‌ఆర్‌తో రైతులకు మేలు