
● మానవ మనుగడకు కష్టాలు ● సహజ లక్షణాలు కోల్పోతున్న నేలలు
పంట సాగులో రైతులు రసాయన ఎరువులను అధికంగా వాడుతున్నారు. దీంతో పుడమికి నష్టం, మానవ మనుగడకు కష్టాలు ఎదురవుతున్నాయి. దీంతో భూమి సహజ లక్షణాలను కోల్పోయి నిస్సారమవుతోంది. ఇది ఇలాగే కొనసాగితేభవిష్యత్‌లో భూములు సేద్యానికి పనికి రాకుండా పోతాయని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే సేంద్రియ ఎరువుల వాడకం ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు.
దుబ్బాకటౌన్:
రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏఓ నరేష్
జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 5.20 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఈ సీజన్‌లో 2.17లక్షల ఎకరాల్లో వరి, 93 వేల ఎకరాల్లో పత్తి, 19 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 31 వేల ఎకరాల్లో కంది, 131 ఎకరాల్లో పెసర పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ అధికారుల అంచనా. పంట దిగుబడి ఎక్కువగా రావాలని రైతులు ఎకరాకు 150 కిలోల డీఏపీ, వంద కిలోల యూరియాను వినియోగిస్తున్నారు. పూత దశకు వచ్చాక పత్తికి 5 సార్లు పురుగుల మందులను పిచికారీ చేసున్నారు. 1960 సంవత్సరంలో వచ్చిన హరిత విప్లవం వ్యవసాయ విధానంతో పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. రసాయనిక ఎరువులతో దిగుబడులు పెరుగుతాయని ఎరువుల మోతాదులు కూడా పెంచుతున్నారు.
క్షీణిస్తున్న భూసారం..
రసాయనిక ఎరువులను విచ్చలవిడిగా వాడటం ద్వారా పంట భూములు నిస్సారమవుతున్నాయి. యూరియా బస్తాల్లో 46 శాతమే యూరియా ఉంటుంది. మిగతా 54 శాతం సున్నపు గుళికలాంటి మూలపదార్థాలు ఉంటాయి. ఈ గుళికలపై సున్నపు పూత పూస్తారు. దీనిని నేలపై వేయడంతో 54 శాతం ఉన్న మూల పదార్థాలు ఏటా నేలపై పేరుకుపోయి భూసారం తగ్గుతుంది. నేలపై ఉండే సహజ బ్యాక్టీరియా, రైతు నేస్తాలు నశించిపోతున్నాయి. ఫలితంగా రైతులకు దిగుబడులు తగ్గుతున్నాయి.
కాలానికనుగుణంగా మారుతూ..
గతంలో వ్యవసాయం చేసే తీరే వేరుగా ఉండేది. రైతులు తమ కుటుంబానికి సరిపడా అన్ని రకాల పంటలు పండించేవారు. దిగుబడుల కోసం సేంద్రియ ఎరువులనే చల్లేవారు. అందువల్లే అప్పట్లో రైతులు ఆరోగ్యంగా ఉండేవారు. పశువుల మల, మూత్ర వ్యర్థాలతో తయారు చేసిన ఎరువులను ఎక్కువగా వినియోగించేవారు. కానీ మారుతున్న కాలానికనుగుణంగా వ్యవసాయ విధానం కూడా మారుతూ వస్తుంది.
సేంద్రియ ఎరువులు ఉత్తమం
భూముల సారం కోల్పోకుండా ఉండేందుకు రైతులు సేంద్రియ ఎరువులు వాడాలి. ఈ ఎరువులతో భూమిలో పోషక విలువలు పెరిగి గుల్లగా మారుతుంది. నీటిని పీల్చుకునే తత్వం వృద్ధి చెందుతుంది. మొక్కలకు నీటితో పాటు కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. రైతులు నానో యూరియాను వాడండి. సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పిస్తున్నాం.
– మల్లయ్య, ఏడీఏ, దుబ్బాక
యూరియా కోసం బారులు..
అధిక యూరియా వినియోగించవద్దని రాయపోల్, దౌల్తాబాద్ మండలాల్లో రైతులకు అవగాహన కల్పించినా తీరు మారడం లేదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. సరిపడా యూరియా పంపిణీ చేసినా కూడా అధిక శాతం కొనుగోలు చేస్తున్నారని అఽధికారులు
చెబుతున్నారు.

● మానవ మనుగడకు కష్టాలు ● సహజ లక్షణాలు కోల్పోతున్న నేలలు