
మద్రాస్ ఐఐటీతో అనంతసాగర్ ఒప్పందం
చిన్నకోడూరు(సిద్దిపేట): స్కూల్ కనెక్ట్ పేరుతో ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి మండలంలోని అనంతసాగర్ జెడ్పీ ఉన్నత పాఠశాల భాగస్వామ్యం కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ లాంటి కోర్సులు, కోడింగ్ సంబంధించిన విషయాలను ఐఐటీ ఫ్రొఫెసర్లతో ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులు నేర్చుకోనున్నారు. పూర్తి విధి,విధానాలను త్వరలో పాఠశాలకు తెలియజేస్తారని పాఠశాల హెచ్‌ఎం జ్యోతి తెలిపారు.
రైస్‌మిల్ యజమాని అరెస్ట్
చిన్నశంకరంపేట(మెదక్): రైస్‌మిల్ యజమాని, మాజీ సర్పంచ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మండల కేంద్రంలో రైస్‌మిల్ నిర్వహించే మైనంపల్లి రంగారావు గత ఏడాది ప్రభుత్వ ధాన్యం తీసుకుని తిరిగి బియ్యం అందించడంలో విఫలమయ్యాడు. ప్రభుత్వానికి రూ.1 కోటి 35 లక్షలు బకాయిపడగా, అందులో రూ.కోటి నగదు రూపంలో చెల్లించాడు. మరో రూ.35 లక్షలకు తోడు 25 శాతం పెనాల్టీ చెల్లించాలని అధికారులు నోటీసులిచ్చారు. కాగా పెనాల్టీ తగ్గించాలని రంగారావు అభ్యర్థించాడు. కాగా ఈ కేసులో చిన్నశంకరంపేట పోలీసులు కుటుంబ సభ్యులతో తిరుపతి వెళ్లిన రంగారావును అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.
బైక్‌ను తగులబెట్టినదుండగులు
నర్సాపూర్ : గుర్తు తెలియని దుండగులు బైక్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ లింగం వివరాల ప్రకారం... నర్సాపూర్‌కు చెందిన రమేష్‌నాయక్ సోమవారం రాత్రి ఇంటి ముందు బైక్‌ను పార్కు చేశాడు. అర్ధరాత్రి శబ్దం వినిపించడంతో బయటకు వచ్చి చూసేసరికి బైక్ కాలిపోతుండటంతో కుటుంబ సభ్యులతో కలిసి మంటలు ఆర్పాడు. బైక్ తగులబడుతున్న సమయంలో ఓ వ్యక్తి కన్పించాడని, అతడికి, తనకు గతంలో డబ్బుల విషయమై గొడవలు జరిగాయని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మందుబాబులకు
జైలు, జరిమానా
సిద్దిపేటకమాన్: మందుబాబులకు సిద్దిపేట కోర్టు జరిమానా, జైలు శిక్ష విధించింది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్ వివరాల ప్రకారం... పట్టణంలోని పలు ప్రాంతాల్లో సిబ్బందితో వారం రోజుల క్రితం నిర్వహించిన వాహన తనిఖీల్లో 18మంది మద్యం తాగి పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి వారికి రూ.28,500 జరిమానా, వీరిలో ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష విధించారు.
చికిత్స పొందుతూవ్యక్తి మృతి
శివ్వంపేట(నర్సాపూర్): చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని తుక్యా తండాకు చెందిన సితారం(50) బోరు మోటార్లు రిపేర్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారం రోజుల క్రితం తిమ్మాపూర్ నుంచి తండాకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని మహిళ..
సంగారెడ్డి క్రైమ్: ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ వివరాల ప్రకారం... గుర్తు తెలియని మహిళ(35 నుంచి 45), గత నెల 24న ఆస్పత్రి అత్యవసర ద్వారం వద్ద మహిళ అపస్మారక స్థితిలో పడి ఉంది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆమె చికిత్స పొందుతూ గత నెల 28న మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మంగళవారం సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ మార్చురీలో భద్రపరిచారు.
ఫలహారం బండి ఊరేగింపు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఆషాఢమాస బోనాల ఉత్సవాలు సిద్దిపేట జిల్లాలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతి రోజు అమ్మవార్లకు భక్తులు బోనాలు తీసుకెళ్లి నైవేద్యాలు సమర్పించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని నల్లపోచమ్మ ఆలయానికి భక్తులు ఫలహారాల బండిని తరలించారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, జోగినిల నృత్యాలు, డోలు చప్పుళ్ల మధ్య ఫలహారం బండి అమ్మవారి ఆలయానికి చేరుకుంది. సిద్దిపేటలో ఫలహారాల బండి అమ్మవారి వద్దకు ఊరేగింపుగా వెళ్లడం ఇదే తొలిసారి అవ్వడంతో భక్తులు భారీగాతరలివచ్చారు.

మద్రాస్ ఐఐటీతో అనంతసాగర్ ఒప్పందం