
బంతిరాళ్ల సమాధులను పరిరక్షించాలి
కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని అయినాపూర్ శివారులో క్రీస్తూ పూర్వం 2వేల సంవత్సరాల నాటి బంతిరాళ్ల సమాధులు ఉన్నాయని, అవి మాయమవుతున్నాయని చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ పేర్కొన్నారు. బంతిరాళ్ల సమాధులను పరిశీలించి వివరాలు వెల్లడించారు. ప్రాచీన శిలాయుగంలో మనిషి కళేబరాన్ని ప్రకృతికి వదిలివేయగా, కొత్త రాతి యుగంలో చనిపోయిన వ్యక్తితో పాటు అతనికి ఇష్టమైన వస్తువులు, వాడిన వస్తువులు అతనితో పాటు ఖననం చేసేవారని చెప్పారు. ఈ సమాధుల చుట్టూ పెద్ద బండరాళ్లను పేర్చి మధ్యలో చనిపోయిన వ్యక్తిని ఖననం చేసేవారని తెలిపారు. ఆ రాళ్లను రాక్షసులు పెట్టేవారు అనుకుని రాకాసి గుళ్లు అని , బంతిరాళ్ల సమాధులు పిలుస్తుంటారని వివరించారు. అయినాపూర్ గ్రామ శివారులో 60 వరకు ఉండేవని రైతులు వాటిని తీసివేసి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం నాలుగు మాత్రమే ఉన్నాయని వాటిని కాపాడాలని కోరారు.
చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్