
గ్రూపులొద్దు.. రచ్చకెక్కొద్దు
మహిళలను కోటీశ్వరులను చేస్తాం
ప్రణాళికాబద్ధంగా ల్యాబ్‌లు నిర్వహించాలి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: విబేధాలుంటే రచ్చకెక్కి మాట్లాడొద్దు.. ఏమైనా సమన్వయ సమస్య ఎదురైతే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలి.. లేనిపక్షంలో టీపీసీసీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలి.. అంతేకానీ ఇష్టానుసారంగా మాట్లాడొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ నేతలకు సూచించారు. సోమవారం గాంధీభవన్‌లో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల కీలక నాయకులతో సమావేశం జరిగింది. సంస్థాగత నిర్మాణం గ్రామ, మండల, జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘాల నియామకం తదితర అంశాలపై పొన్నం నేతలతో చర్చించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే నామినెటేడ్, పార్టీ పదవుల ఎంపికలో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి రెండు చొప్పున రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ల పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా అన్ని నామినేటెడ్ పదవులతో పాటు, పార్టీ సంస్థాగత పదవుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఆయా పదవుల కోసం ఇచ్చిన జాబితాలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి టీపీసీసీ, ఏఐసీసీ నాయకత్వానికి పంపుతామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్‌షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్, మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు రాజిరెడ్డి, టి.నర్సారెడ్డి, నాయకులు ఉప్పల శ్రీనివాస్‌గుప్త, మెట్టుసాయికుమార్ పాల్గొన్నారు.
నారాయణఖేడ్: మహిళలను కోటీశ్వరులను చేయాలన్ననే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సోమవారం ఖేడ్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఇందిర మహిళాశక్తి విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా పలు మహిళా సంఘాల సభ్యులకు వ డ్డీ రాయితీకి సంబంధించి రూ. 2,87,82,000 చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాడు దివంగత వైఎస్సార్ మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చారని, తర్వాత బీఆర్‌ఎస్ పట్టించుకోలేదన్నారు. తిరిగి తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు చేయూతనందిస్తుందని తెలిపారు. నియోజకవర్గంలోని మహిళా సంఘాల సభ్యులు ముందుకు వస్తే రెండు బస్సులు, పెట్రోల్‌బంక్‌లు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మండలంలోని వెంకటాపూర్ అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. రూ. 3.86 కోట్లతో అర్బన్ పార్కుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీఎఫ్‌ఓ శ్రీధర్‌రావు, రేంజ్ అధికారిణి అనురాధ, సి బ్బందితో కలిసి వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గిరిజా షెట్కార్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, ఐకేపీ పీడీ జ్యోతి, డీపీఎం సుధాకర్, ఏపీఎంలు వంశీకృష్ణ, సాయిలు, అనంతయ్య, కుమార్, శేఖర్, సీసీలు, మహిళా సంఘాల సభ్యులు నాయకు లు త దితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
మెదక్ కలెక్టరేట్: అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను జిల్లాలో ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని డీఈఓ రాధాకిషన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ తరగతులను సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సైన్స్‌ను ప్రయోగశాలకు అనుసంధానం చేయాలన్నారు. సైన్స్, గణితం ఉపాధ్యాయులకు ల్యాబ్‌ల నిర్వహణపై అవగాహన కల్పించడానికి రెండు రోజులపాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్ అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్‌మూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విభేదాలొస్తే అంతర్గతంగా చర్చించుకోవాలి
అవసరమైతే పీసీసీ దృష్టికి తీసుకురండి
ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు పొన్నం సూచన

గ్రూపులొద్దు.. రచ్చకెక్కొద్దు