
నిమ్జ్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
● డిప్యూటీ తహసీల్దార్ వద్దరూ.15 వేలు స్వాధీనం ● మరో రూ.50 వేలు రికవరీ ● డిప్యూటీ కలెక్టర్‌తో సహ మరో ఇద్దరు అరెస్టు
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ నిమ్జ్ కార్యాలయంపై గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ వద్ద రూ.15 వేలు, డిప్యూటీ కలెక్టర్‌కు ఇవ్వాలనుకున్న మరో రూ.50 వేలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. ఏసీబీ మెదక్ డీఎస్‌పీ సుదర్శన్ కథనం ప్రకారం..న్యాల్‌కల్ మండలంలోని హుసెల్లి గ్రామానికి చెందిన షేక్ మహ్మద్ మక్బూల్ 50 ఏళ్ల నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయనకు సంబంధించిన భూమి గ్రామంలో ఉంది. నిమ్జ్ ప్రాజెక్టులో భూమి పోతుందని తెలుసుకున్న అతడు పరిహారం కోసం కార్యాలయానికి వెళ్లి డిప్యూటీ కలెక్టర్ రాజును కలిసి పట్టాపాస్‌బుక్‌ను అందజేశాడు. ఏడాది నుంచి తిరుగుతున్నా పరిహారం ఇవ్వడం లేదు. మే 9న పరిహారం ఇస్తామని, కార్యాలయానికి రావాలని ఫోన్ వచ్చింది. అక్కడికి వెళ్లిన ఆయనను విచారణ చేయాలని పంపించారు. మక్బూల్‌కు ఓరోజు డ్రైవర్ దుర్గయ్య ఫోన్ చేసి రూ.5 లక్షలు ఇస్తే పని అవుతుందని చెప్పాడు. డిప్యూటీ కలెక్టర్ రాజుకు రూ.50 వేలు, డిప్యూటీ తహసీల్దార్ సతీశ్‌కు రూ.15 వేలు కార్యాలయం సిబ్బందికి కలిపి మొత్తం రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రూ.75 వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఈ మేరకు రూ. 52.87 లక్షల పరిహారం డబ్బులు మక్బూల్ బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఆ తర్వాత డబ్బుల కోసం ఫోన్ చేస్తుండటంతో విసుగుచెందిన మక్బూల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సలహా మేరకు గురువారం నిమ్జ్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సతీష్‌కు రూ.15 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డిప్యూటీ కలెక్టర్‌కు రూ.50 వేలు ఇవ్వడానికి వెళ్లగా హైదరాబాద్‌లో తీసుకుంటానన్నాడు. రూ.50 వేలను స్వాఽధీనం చేసుకుని ,డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డిప్యూటీ కలెక్టర్ రాజు, డ్రైవర్ దుర్గయ్యను అరెస్టు చేశారు.