
స్మార్ట్ సిటీకి నిధులివ్వండి
● రూ.596.61 కోట్లు మంజూరుకు వినతి
● గతేడాది ఆగస్టులో జహీరాబాద్ స్మార్ట్ సిటీని ప్రకటించిన కేంద్రం
● ఇప్పటివరకు అడుగు ముందుకు పడని వైనం
● స్మార్ట్‌సిటీతో భారీగా విస్తరించనున్న పట్టణం
జహీరాబాద్/సంగారెడ్డి జోన్: గతేడాది కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్‌ను స్మార్ట్ సిటీగా ప్రకటించింది. అయినా ఇప్పటివరకు నిధుల కేటాయింపు జరగలేదు. ఈనెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయెల్‌ను కలిసి జహీరాబాద్ స్మార్ట్ సిటీ ఏర్పాటు విషయాన్ని ప్రస్తావించారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి, జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమలు ట్రస్ట్(ఎన్‌ఐసీడీఐటీ) ఆమోదించిన రూ. 596.61 కోట్లను త్వరగా విడుదల చేయాలని కోరా రు. స్మార్ట్‌సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్ ఇతర వసతుల కల్పనకుగాను ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
ఇక ప్రాజెక్టు ఏర్పాటు వేగిరం!
దేశవ్యాప్తంగా మొత్తం 12 ప్రపంచస్థాయి గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉందని ఆశించినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. సీఎం చొరవతోనైనా నిధులు కేటాయింపులు జరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు ఏర్పాటు వేగవంతమయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
3,200ఎకరాల విస్తీర్ణంలో స్మార్ట్ సిటీ
ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లో ఏర్పాటు కాబోతున్న నిమ్జ్( జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి) పరిసర గ్రామాలు బర్దీపూర్, చీలపల్లి, చీలపల్లి తండా, ముంగి గ్రామ శివారులో స్మార్ట్ సిటీ ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో ప్రాజెక్టు కోసం 3,200 ఎకరాల భూమిని కేటాయించి రూ.2,361 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రాజెక్టు ఏర్పాటు పూర్తయితే పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతంగా జరగడంతోపాటు జహీరాబాద్ పట్టణం బాగా విస్తరించనుంది. రాష్ట్ర సరిహద్దులో ప్రాజెక్టును ఏర్పాటు చేయడంతో నిమ్జ్ ప్రాజెక్టుతోపాటు పొరుగు రాష్ట్రం కర్ణాటకకు దోహదపడనుంది.
హైదరాబాద్–నాగపూర్ కారిడార్ ప్రాజెక్టు
హైదరాబాద్–నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ఇంప్లిమెంటేషన్‌లో భాగంగా ప్రాజెక్టు నెలకొల్పనున్నారు. ఇప్పటికే ముంబై జాతీయ రహదారి నుంచి నిమ్జ్ పారిశ్రామిక ప్రాంతం వరకు ప్రత్యేక రహదారిని పూర్తి చేశారు.
భూసేకరణకు ప్రత్యేక చర్యలు
నిమ్జ్‌లో భాగంగా భూములను సేకరించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రెండు మండలాల్లో సుమారు 12 వేలకు పైగా ఎకరాల విస్తీర్ణంలో నిమ్జ్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. మొదటి విడతలో 3,600 ఎకరాలు సేకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. రెండవ విడత ద్వారా ఇప్పటివరకు సుమారు 7000 ఎకరాల వరకు భూసేకరణ పూర్తి అయింది. మిగతా భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేయటంతోపాటు సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
జహీరాబాద్ టౌన్ వ్యూ
‘నిమ్జ్’ భూసేకరణ వేగవంతం
కలెక్టర్ ప్రావీణ్య
జహీరాబాద్: జహీరాబాద్ ప్రాంతంలో ఏర్పాటవుతున్న జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్)కు సంబంధించి భూ సేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం జహీరాబాద్‌లోని ఆర్డీఓ కార్యాలయంలో నిమ్జ్ ప్రత్యేక అధికారి రాజు, ఆర్డీఓ రాంరెడ్డి, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..నిమ్జ్ ప్రాజెక్టు ఫేజ్–1కు అవసరమైన భూమిని సేకరించాల్సి ఉందని, దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఫేజ్–1లో మొత్తం 3,240 ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటి వరకు 2,888 ఎకరాల భూమి మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన భూ సేకరణ ఇంకా పూర్తి కాలేదని, సంబంధిత గ్రామాల రైతులు, భూమి యజమానులతో చర్చించి సమస్యలు పరిష్కరించి భూ సేకరణను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూముల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.
పెరగనున్న ఉపాధి అవకాశాలు
స్మార్ట్ సిటీ ఏర్పాటుతో యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేక్షంగా 1.74 లక్షల మందికి ఉ పాధి లభించే అవకాశం ఉండగా పరోక్షంగా మరో 1లక్ష మంది ఉపాధి పొందనున్నారు. యు వతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు వీలుగా నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పా టు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.