
బందే మాతరం
●కదిలిన కార్మిక, కర్షక లోకం ●లేబర్ కోడ్‌లను రద్దు చేయకపోతే తరిమికొడతాం
●కేంద్రం మెడలు వంచే వరకు పోరాటం ఆగదు ●సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు
సంగారెడ్డిఎడ్యుకేషన్/జోగిపేట (అందోల్)/జహీరాబాద్‌టౌన్/జిన్నారం పటాన్‌చెరు: కేంద్రంలోని మోదీ సర్కారు కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం కార్మిక, కర్షక లోకం కదం తొక్కింది. కార్మిక, కర్షక సంఘాలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బంద్‌లో పాల్గొనడంతో సార్వత్రిక సమ్మె జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది. బంద్ నేపథ్యంలో పలు పట్టణాల్లో వ్యాపార, వాణిజ్య దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో పారిశ్రామికవాడలోని పరిశ్రమలన్నింటిలో ఉత్పత్తి నిలిచిపోయింది. జహీరాబాద్ పట్టణంలో కార్మికులు, సంఘాల నాయకులు శ్రామీక్‌భవన్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆందోల్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ యార్డు నుంచి పట్టణంలోని చౌరస్తావరకు భారీ ర్యాలీ చేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వరకు కార్మిక, కర్షక సంఘాలు భారీ ర్యాలీ చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు మాట్లాడుతూ...నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తీరుతామన్నారు. కార్మికవర్గం పొట్టగొట్టే విధంగా నాలుగు లేబర్ కోడ్‌లు తీసుకురావాలనుకోవడం ప్రధానిమోదీ దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. కార్మికులకు యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కును కాలరాయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కార్మికులు యూనియన్ పెట్టుకోకుండా జీతభత్యాల కోసం, సదుపాయాల కోసం బేరసారాలు ఆడకుండా చేయడం అంటే అది పెట్టుబడుదారుల లాభాలను కాపాడటం తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. లేబర్ కోడ్‌ల రద్దు కోసం సమ్మె చేస్తుంటే ఆర్‌ఎస్‌ఎస్, బీఎంఎస్ లాంటి సంస్థలు కార్మిక సంఘాలు రాజకీయం చేస్తున్నాయని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. సమరశీల పోరాటాల ద్వారానే ఈ నాలుగు నల్ల చట్టాలను రద్దు చేయించుకోగలమని చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం, నాయకులు బాగారెడ్డి యాదగిరి, ఐఎన్‌టీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ప్రసాద్, నాయకులు నర్సింహులు, ఎంఆర్‌ఎఫ్ కేపీఎస్ నాయకులు నారాయణ, సీఐటీయూ నాయకులు నాగభూషణం, ప్రసన్న, సురేశ్ రాందాస్, కొండల్ రెడ్డి, రమేశ్, భీమ్‌రెడ్డి, సువర్ణ, రాజు, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వస్తున్న కార్మిక సంఘాల నాయకులు