
కార్మికుల మృతదేహాల గుర్తింపు పూర్తికాలేదు
●కలెక్టర్ ప్రావీణ్య వెల్లడి ●త్వరలో ప్రభుత్వానికి నివేదిక
ఈ మరణాల ధ్రువీకరణకు అనుమతి
పటాన్‌చెరు: సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మృతి చెందిన 8 మంది కార్మికుల మృతదేహాల గుర్తింపు ఇంకా పూర్తి కాలేదని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 44 మంది మృతిచెందినట్లు నిర్ధారించామని, మృతదేహాలను, అవశేషాలను కుటుంబ సభ్యులకు అప్పగించి, వారివారి స్వగ్రామాలకు రవాణా సౌకర్యాలు ఏర్పాటుచేసి పంపించామని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 14 మంది వివిధ ఆసుపత్రులలో మెరుగైన చికిత్స అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఎనిమిదిమంది మృతదేహాలు గుర్తించాల్సి ఉందన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటివరకు మృతులకు సంబంధించి 70 మానవ శరీర అవశేషాలు, డీఎన్‌ఏ పరీక్షకు పంపించినట్లు తెలిపారు. పంపిన శాంపిల్స్‌లో ఇప్పటివరకు 67 శాంపిల్స్ నిర్ధారణ, ముందు గుర్తించి మృతుల గుర్తులతో సరిపోలుతున్నాయన్నారు. మిగిలిన 8 మంది మృతులకు సరిపోయే ఆధారాలు ఇంకా దొరకలేదన్నారు. ఘటనా స్థలంలో లభ్యమైన అవశేషాలతో వీరి డీఎన్‌ఏ నమూనాలు ఏవీ సరిపోలలేదని చెప్పారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు వీరి కుటుంబ సభ్యులకు తెలియజేశామన్నారు. వీరి ఆచూకీ లభ్యం కాని పక్షంలో మృతులుగా పరిగణిస్తామని వెల్లడించారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ విషయాన్ని మృతుల కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ద్వారా తెలియజేస్తామన్నారు. ఆచూకీ లేని ఎనిమిదిమంది గురించి ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు సదరు కుటుంబ సభ్యులకు తెలిపామన్నారు. ఆచూకీ దొరకని వారి బాధిత కుటుంబాలకు తాత్కాలిక పరిహారం కింద, వారు స్వస్థలానికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు కంపెనీ తరఫున రూ.15లక్షలు అందజేసినట్లు చెప్పారు.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సాధారణంగా ఎవరైనా కనిపించకుండాపోతే ఎఫ్‌ఐఆర్ అయ్యాక ఏడు సంవత్సరాల తర్వాత మరణించినట్లు ధ్రువీకరణ ఉంటుందని సంగారెడ్డి అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆచూకీ లేకుండా పోయిన వారికి డెత్ సర్టిఫికెట్లు అందజేసేందుకు ప్రత్యేకంగా లీగల్ ప్రాసెస్ ఉంటుందన్నారు. కానీ, ఈ దుర్ఘటన విపత్తుగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని మరణ ధ్రువీకరణ ప్రక్రియను కొనసాగిస్తామని చెప్పారు. బాధితులకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపుపై హామీనిస్తూనే వారికి భరోసా ఇచ్చేందుకు రూ.15 లక్షల చెక్కును తక్షణ సాయం కింద పంపిణీ చేశాము. ఘటన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉంటాం. బాధిత కుటుంబాల కోసం ఐలా కార్యాలయంలో శిబిరాన్ని కొనసాగిస్తాము. బాధితులు ఈ చెక్కును తీసుకుని తమ వారి ఆచూకీ దొరికే వరకు ఇక్కడే ఉండాలని నిర్ణయిస్తే వారి కోసం ఈ శిబిరాన్ని కొనసాగిస్తామని చెప్పారు.
అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్