సిగాఛీ.. నిబంధనల్ని కాలరాసి | - | Sakshi
Sakshi News home page

సిగాఛీ.. నిబంధనల్ని కాలరాసి

Jul 9 2025 7:40 AM | Updated on Jul 9 2025 7:40 AM

సిగాఛ

సిగాఛీ.. నిబంధనల్ని కాలరాసి

సిగాచీ పరిశ్రమకు ఎన్‌డీఎంఏ

క్యాజువల్‌ లేబర్‌తో పనులు చేయించింది

ఈ లేబర్‌ను సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు కనీసం లేబర్‌ లైసెన్సే లేదు

ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్న సిగాచీ పరిశ్రమ యాజమాన్యం ఆగడాలు

మొక్కుబడి తనిఖీలకే పరిమితమైన కార్మికశాఖ అధికారులు

ప్రమాదం జరిగాక నోటీసులు జారీ

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా 44 మంది నిరుపేద కార్మికుల ప్రాణాలను బలిగొన్న సిగాచీ పరిశ్రమ యాజమాన్యం.. ఇటు కార్మిక చట్టాలను కూడా కాలరాసింది. రియాక్టర్లు, బాయిలర్లు.. వంటి కీలక యంత్రాల వద్ద సంబంధిత రంగాల్లో అన్ని అర్హతలున్న స్కిల్డ్‌ వర్కర్లతో పనిచేయించాల్సిన యాజమాన్యం అడ్డా కూలీ (క్యాజువల్‌ లేబర్‌)తో పరిశ్రమల్లో పనిచేయించినట్లు తేలింది. పైగా ఈ పరిశ్రమకు ఈ అడ్డాకూలీలను ఇద్దరు లేబర్‌ కాంట్రాక్టర్లు సరఫరా చేశారు. అయితే ఈ కాంట్రాక్టర్లు ఇద్దరికీ కూడా కార్మిక శాఖ నుంచి కనీసం లైసెన్స్‌లు లేవని తేలింది. దీన్ని బట్టి చూస్తే అన్‌స్కిల్డ్‌ వర్కర్లతో కీలక యంత్రాల వద్ద పనులు చేయించడంతోపాటు, కనీస నిబంధనలు పాటించలేదనేది స్పష్టమవుతోంది. అన్ని అర్హతలున్న వారిని ఉద్యోగాల్లో నియమించుకుంటే అధికంగా వేతనాలు ఇవ్వాల్సి ఉంటుందని కక్కుర్తి పడి అడ్డాకూలీలతో పనిచేయించినట్లు తేలింది.

85 మంది రోజువారీ కూలీలు, వర్కర్లే..

నిరుపేద కూలీల ప్రాణాలు గాలిలో కలిశాక కార్మిక శాఖ మేల్కొంది. పొట్టచేతపట్టుకుని ఉత్తరాది రాష్ట్రాల నుంచి వలస వచ్చిన అమాయక కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాక ఈ శాఖ అధికారులు మొద్దునిద్ర వీడారు. ప్రమాదం జరిగాక ప్రభుత్వానికి ఆశాఖ ఓ నివేదిక పంపింది. ఈ నివేదిక ప్రకారం.. ప్రమాదం జరిగినప్పుడు మొత్తం 143 మంది కార్మికులు, ఉద్యోగులున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో 85 మంది డెయిలీ వేజ్‌ లేబరే ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 32 కంపెనీ ఉద్యోగులు ఉండగా, 26 మంది కాంట్రాక్టు వర్కర్లు ఉన్నట్లు గుర్తించారు.

లైసెన్స్‌లేని కాంట్రాక్టర్‌ ద్వారా కూలీలు

ఈ దుర్ఘటన జరిగిన నెలలో జూన్‌లో ఈ పరిశ్రమలో పని ఎక్కువగా ఉందని, ఇందుకోసం రోజువారీ కూలీలతో పనులు చేయించాలని పరిశ్రమ యాజమాన్యం నిర్ణయించింది. ఇందుకోసం 20 మంది రోజు కూలీలను సరఫరా చేసేందుకు ఒక లేబర్‌ కాంట్రాక్టర్‌, పది మంది కూలీలను సరఫరా చేసేందుకు మరో లేబర్‌ కాంట్రాక్టర్‌తో పరిశ్రమ యాజమాన్యం మాట్లాడుకున్నట్లు కార్మికశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్యాజువల్‌ లేబర్‌ను సరఫరా చేస్తున్న ఈ ఇద్దరు లేబర్‌ కాంట్రాక్టర్లకు కార్మిక శాఖ నుంచి ఎలాంటి లైసెన్స్‌ లేకపోవడం గమనార్హం. అంటే కనీసం లైసెన్స్‌ ఉన్న కాంట్రాక్టర్‌ ద్వారా కూడా రోజు వారీ కూలీలను పనిలో పెట్టుకోలేదంటే ఈ పరిశ్రమ యాజమాన్యం అలసత్వం ఏమేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

కనీస సమాచారం లేదు

ఈ ఫ్యాక్టరీని ఇటీవల నిజామాబాద్‌ జిల్లా కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్‌ యాదయ్య తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్మికులతో పనిచేస్తున్న విషయాన్ని యాదయ్య తాను ఆశాఖ ఉన్నతాధికారులకు ఇచ్చిన నివేదికలో పేర్కొనకపోవడం గమనార్హం. కేవలం కార్మికుల సంఖ్య, షిఫ్టులు, వంటి వివరాలు డిస్‌ప్లేబోర్డుపై పెట్టలేదని మాత్రమే నివేదికలో రాసానని యాదయ్య ‘సాక్షి’తో పేర్కొన్నారు.

ప్రమాద స్థలం అధ్యయనం

పటాన్‌చెరు: ఇటీవల భారీ ప్రమాదం జరిగిన పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ ఫార్మా పరిశ్రమను మంగళవారం జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్‌డీఎంఏ) బృందం సందర్శించింది. ఈ బృందం సభ్యులు ప్రమాద స్థలాన్ని నిశితంగా పరిశీలించి అణువణువూ గాలించారు. ప్రమాద వివరాలను ఆ సమయంలో కొనసాగుతున్న ఉత్పత్తి తదితర అంశాలను సుదీర్ఘంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్‌డీఎంఏ కేంద్ర బృందం కమిటీ సభ్యులు, సిగాచీ పరిశ్రమలో ప్రమాదం జరగడానికి గల కారణాలపై అధ్యయనంతో పాటు పరిశ్రమలో జరిగిన భారీ ప్రమాదానికి గల కారణాలు ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో ఏ పరిశ్రమల లోనూ పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై కేంద్రప్రభుత్వ నిర్వహణ సంస్థ కమిటీ సభ్యులు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఘటన జరిగిన తీరును బృందం సభ్యులకు వివరించారు. ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టిన సహాయక చర్యలను కమిటీ సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌, పరిశ్రమల శాఖ, అగ్ని మాపకశాఖ, కార్మికశాఖ, పోలీసు, రెవెన్యూశాఖల అధికారులు పాల్గొన్నారు.

10ఏ కింద నోటీసులు జారీ

ఈ ప్రమాదం జరిగాక సిగాచీ పరిశ్రమ యాజమాన్యానికి సెక్షన్‌ 10–ఏ కింద నోటీసులు జారీ చేసినట్లు కార్మికశాఖ సంగారెడ్డి డిప్యూటీ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. యూ–1 ఫాంలో కార్మికులు, ఉద్యోగుల వివరాలివ్వాలని యాజమాన్యానికి డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం లేఖ రాసింది.

సిగాఛీ.. నిబంధనల్ని కాలరాసి1
1/1

సిగాఛీ.. నిబంధనల్ని కాలరాసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement