
సాగుకు సింగూరు నీరు
వారం రోజుల్లో
విడుదలకు ఏర్పాట్లు
● కాలువ సీసీ పనుల నిలిపివేత
● ఏడాదిగా బ్రష్ కటింగ్‌కే పరిమితం
● విరామంతో ఆయకట్టు రైతుల్లో వ్యతిరేకత
పుల్‌కల్(అందోల్): రెండు పంటల విరామం అనంతరం సింగూరు కాలువల ద్వారా సాగునీరు అందించాలని అధికారులు నిర్ణయించారు. వారంలో నీటి విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాలువలకు సిమెంట్ లైనింగ్ చేస్తామని రెండు పంటలకు క్రాప్ హాలీడే ప్రకటించారు. ఎనిమిది నెలలుగా కాంట్రాక్టర్ కేవలం బ్రష్ కటింగ్ మాత్రమే చేశారు. అటు కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు నెమ్మదించడం.. ఇటు పంటలకు సాగు నీరు అందకపోవడంతో అధికారులను నాయకులు, రైతులు విమర్శించారు. దశాబ్ద కాలంగా పంట కాలువలపై ఆధారపడి సాగుచేసిన రైతులు బోరు మోటార్ల సాగుపై అంతగా ఆసక్తి చూపలేదు.
స్థానిక ఎన్నికలపై ప్రభావం
సింగూరు సాగునీటి కాలువలకు మరమ్మతుల పేరుతో ఏడాదిగా క్రాఫ్ హాలీడే ప్రకటించడంతో మూడు మండలాలలోని ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన చెందారు. కాలువ మరమ్మతుల్లో కాలయాపన.. ఇటు సాగునీరు అందించకపోవడంతో ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో స్థానిక ఎన్నికలపై ప్రభావం పడుతుందని గ్రహించిన అధికార పార్టీ నాయకులు వానాకాలం కాలువ మరమ్మతు పనులు ఆపి సాగు నీరు అందించాలని మంత్రి దామోదరను కోరారు. దీంతో మంత్రి ప్రాజెక్టు అధికారులు, స్థానిక నాయకులతో సమీక్షించి ఆయకట్టుకు నీరివ్వాలని ఆదేశించారు. నాయకుల సూచనల మేరకు వారం రోజుల్లో ఆయకట్టుకు నీరివ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు పంటలకు మొండి చేయి
మంత్రి దామోదర ప్రత్యేక చొరవతో కాలువలకు సీసీ పనుల చేయడానికి రూ. 168.30 కోట్ల నిధులను మంజూరు చేశారు. రూ. 138 కోట్లతో సీవెట్ అనే సంస్థ కాంట్రాక్టు దక్కించుకొని పనులు ప్రారంభించింది. ఎనిమిది నెలల నుంచి రూ. కోటి వరకు ఖర్చు చేసి కాలువలకు కేవలం బ్రష్ కటింగ్ మాత్రమే పూర్తి చేశారు. సింగూరు ప్రాజెక్టులో సమృద్ధిగా నీరున్న కాలువలకు సీసీ మరమ్మతుల పేరుతో ఏడాది పాటు కాలయాపన చేశారని రైతులు విమర్శించారు. రెండు పంటలకు రైతు భరోసా ఇవ్వకపోవడం, సాగుకు నీరు ఇవ్వకపోవడంతో ఆయకట్టు రైతులు ప్రభుత్వ పని తీరును విమర్శించారు. ఓ దశలో గ్రామ సభలకు వచ్చిన ప్రజాప్రతినిధులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

సాగుకు సింగూరు నీరు