
చిచ్చురేపిన పచ్చగడ్డి●
వర్గల్(గజ్వేల్): పచ్చగడ్డి వేసిన పొలం చిచ్చురేపింది. భూ తగాదా వృద్ధుని ఉసురుతీసింది. వరుసకు కొడుకే హంతకుడయ్యాడు. పారతో దాడిచేసి హతమార్చాడు. రెండు రోజుల క్రితం (శనివారం) వర్గల్ మండలం వేలూరులో వృద్ధుడు రాయన్న నర్సయ్య హత్యకేసును గౌరారం పోలీసులు ఛేదించారు. సోమవారం నిందితుని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. గౌరారం సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి ఈ కేసుకు సంబంధించి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. వేలూరు గ్రామానికి చెందిన రాయన్న నర్సయ్య(65), వరుసకు కొడుకై న చింతకింది రాజు(39) పొలాలు పక్కపక్కనే ఉంటాయి. వీరిద్దరి మధ్య భూతగాదాలు ఉన్నాయి. గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నర్సయ్య పొలం సమీపంలో రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి, సిబ్బంది వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు, గొడవలు, భూవివాదాలు, పాత కక్షలు తదితర అంశాలు పరిగణనలోకి తీసుకుని విచారణ జరిపారు. హత్యకు పాల్పడిన వరుసకు కొడుకై న చింతకింది రాజును అదుపులోకి తీసుకుని విచారించారు. శనివారం సాయంత్రం వ్యవసాయపొలంలో పనిచేసుకుంటున్న రాజు వద్దకు నర్సయ్య వెళ్లి తన పొలంలో పచ్చగడ్డి ఎందుకు వేశావంటూ తిట్టాడు. కోపంతో రాజు తన చేతిలో ఉన్న పారతో మూడు, నాలుగుసార్లు మెడ, తలపై బాదడంతో నర్సయ్య చనిపోయాడు. ఈ మేరకు నిందితుడు రాజు నేరం అంగీకరించాడని, అతనిని అరెస్ట్‌చేసి సోమవారం రిమాండ్ చేశామని సీఐ పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి, సిబ్బందిని ఆయన అభినందించారు. కాగా తనను చేరదీసి, అప్యాయంగా పెంచిన తాత నర్సయ్య హత్యకు గురవడంతో మనవరాలు శ్వేత అనాథగా మిగిలిపోయింది.
● వృద్ధుడి ఉసురు తీసిన భూ తగాదా
● వరుసకు కొడుకే నిందితుడు
● వేలూరు వృద్ధుని హత్యకేసు ఛేదించిన పోలీసులు