
క్రీడాభివృద్ధికి రూ.700 కోట్లు
హుస్నాబాద్: దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదిగి రాష్ట్రానికి ఖ్యాతి తీసుకురావాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీస్‌ల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి హుస్నాబాద్ మిని స్టేడియంను సందర్శించారు. స్ధానిక క్రీడాకారులు, విద్యార్ధుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ ..తమ ప్రభుత్వం మొదటి మంత్రివర్గ సమావేశంలోనే క్రీడా పాలసీని ప్రకటించిందని చెప్పారు. అంతర్జాతీయ స్ధాయిలో, ఒలింపిక్ గేమ్స్‌లో దేశం నుంచి ఒక్క బంగారు పతకాన్ని సాధించలేకపోయామని విచారం వ్యక్తం చేశారు. క్రీడల అభివృద్ధికి రూ.700 కోట్లు కేటాయించామని చెప్పారు. హుస్నాబాద్ ప్రాంతంలో విద్యార్ధులు క్రీడల పట్ల ఆసక్తిని కనబరచడం సంతోషకర విషయమన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్ష మేరకు హుస్నాబాద్‌లో స్విమ్మింగ్ పూల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సాంకేతిక సమస్యలు అధిగమించి క్రికెట్ స్టేడియంను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని పాఠశాలల్లో అన్ని రకాల స్పోర్ట్స్ కిట్లను అందిస్తామన్నారు.
హుస్నాబాద్ క్రీడలకు పెట్టింది పేరు: పొన్నం
హుస్నాబాద్ నుంచి అనేక మంది క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రతి గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యార్ధులు, యువకులు ఉపయోగించుకోవాలన్నారు. కబడ్డీ కోర్టుకు రెండు మ్యాట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్ధ చైర్మన్ శివసేనా రెడ్డి మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రతి నియోజకవర్గంలో క్రీడా సౌకర్యాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు. అనంతరం మినీ స్టేడియంలో మంత్రులు, కలెక్టర్, ఇతర అధికారులు తల్లుల పేరు మీద మొక్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, క్రీడా ప్రాధికార సంస్ధ డైరెక్టర్ సోనీ బాలాదేవి, అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్, తదితరులు ఉన్నారు.
దేశం గర్వించదగ్గ
క్రీడాకారులుగా ఎదగాలి
హుస్నాబాద్‌కు
స్విమ్మింగ్ పూల్ మంజూరు
మంత్రి వాకిటి శ్రీహరి