
మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): పంచాయతీ కార్మికుల మెడకు ఉరితాడుగా మారిన మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న పంచాయతీ కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన నేపథ్యంలో వారిని కలిసి సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పంచాయతీ సిబ్బంది వేతనాలకు బడ్జెట్ కేటాయించి.. గ్రీన్‌చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బందిని కూడా రెండో పీఆర్‌సీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. జీవోనంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన వారిలో పంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి దశరథ్,యూనియన్ నాయకులు సంజీవ్, శేఖర్, రాములు, నగేష్, మైపాల్, యాదమ్మ, అశోక్, నర్సింలు తదితరులున్నారు.