
మంజీరా వాగులో దూకి యువకుడు ఆత్మహత్య
చిలప్‌చెడ్(నర్సాపూర్): మంజీ రా వాగులో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిలప్‌చెడ్ మండలం చిట్కుల్ శివారులో చోటు చేసుకుంది. శుక్రవారం స్థానికుల కథనం మేరకు.. మండల పరిధిలోని చండూర్ గ్రామానికి చెందిన గుట్టమీది నవీన్ (28) కౌడిపల్లిలో గ్యాస్ డెలివరీ బాయ్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి కూలీ పనులకు వెళ్లేది. భార్య (క్యాన్సర్) అనారోగ్యంతో బాధపడుతుండగా మనస్తాపం చెంది మంజీరా వాగులో దూకి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీయించి, పోస్ట్‌మార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్‌ఐ నర్సింలును వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.
భార్య కాపురానికి రావడం లేదని..
చేగుంట(తూప్రాన్): భార్య కాపురానికి రావడం లేదని ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రమైన చేగుంట జీవిక పరిశ్రమలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి కథనం మేరకు.. బీహార్ రాష్ట్రం వైశాలీ జిల్లా కై జూ గ్రామానికి చెందిన నందూలాల్ చౌదరీ(28) ఇటీవల చేగుంట జీవిక పరిశ్రమలో పని చేసేందుకు వచ్చాడు. పరిశ్రమ యాజమాన్యం ఇచ్చిన లేబర్ గదిలో ఉంటున్నాడు. నందూలాల్‌కు ఏడాది కిందట వివాహం కాగా భార్య కాపురం చేయడం లేదని తరుచూ బాధ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి నందూలాల్ పరిశ్రమలోని గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేగుంటలో నివాసం ఉంటున్న మృతుడి పెద్దనాన్న కుమారుడు విరుజ్ చౌదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతుడి బంధువులకు సమాచారం అందించినట్లు ఎస్‌ఐ తెలిపారు.